బుధవారం శాసనసభా సమావేశాల్లో ఎల్ఆర్ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ జీవో 131 ని సవరిస్తామని, ఇందుకోసం వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గురువారం ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వును జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ ఛార్జీలను ప్రస్తుత మార్కెట్ విలువను కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ రుసుంను వసూలు చేయనున్నారు.
2015 నాటి ఎల్ఆర్ఎస్ స్లాబులతో క్రమబద్ధీకరణ రుసుంను వసూలు చేయనున్నారు. చదరపు గజం మార్కెట్ విలువ రూ. 3 వేల వరకు ఉంటే 20 శాతం, రూ. 3,001 నుండి రూ. 5వేల వరకు ఉంటే 30 శాతం, రూ. 5,001 నుండి రూ. 10 వేల వరకు ఉంటే 40 శాతం, రూ. 10,001 నుండి రూ. 20 వేల వరకు ఉంటే 50 శాతం, రూ. 20,001 నుండి రూ. 30 వేల వరకు ఉంటే 60 శాతం, రూ. 30,001 నుండి రూ. 50 వేల వరకు ఉంటే 80 శాతం, రూ. 50 వేలకు పైగా ఉంటే వందశాతం క్రమబద్ధీకరణ రుసుం వసూలు చేయనున్నారు. నాలా రుసుం కూడా క్రమబద్ధీకరణ రుసుంలోనే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.