mt_logo

రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు లైన్ క్లియర్

కాంగ్రెస్, బీజేపీల మధ్య బుధవారం జరిగిన చర్చల అనంతరం గురువారమే రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా నిర్ణయం తీసుకున్నారు. 
దీంతో లోక్ సభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడానికి లైన్ క్లియర్ అయ్యింది. సవరణలపై పట్టుబట్టిన బీజేపీ వెనక్కు తగ్గి బిల్లు ఆమోదానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు 20 సవరణలు, అరుణ్ జైట్లీ 2, ప్రకాష్ జవదేకర్ 2 మొత్తం 24 సవరణలు ప్రతిపాదించగా యూపీఏ ప్రభుత్వం సుదీర్ఘ చర్చల అనంతరం సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయమై సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడి సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఐదేళ్లపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరారు. గురువారం జరిగే కేబినెట్ భేటీలో సవరణలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు గనుక ఏమైనా సవరణలు రాజ్యసభలో చేస్తే బిల్లు మళ్ళీ లోక్ సభకు పంపించాల్సి ఉంటుంది. లోక్ సభలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య బిల్లును ఆమోదించడం తెలిసిందే. మళ్ళీ లోక్ సభకు పంపడం అంటే జరిగేపని కాదని, గవర్నర్ అధికారాల విషయంలో సవరణ చేయడంవల్ల రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి ఉంటుందని భావించి కాంగ్రెస్ పెద్దలు, ఎంపీలు బీజేపీ నాయకత్వంతో మాట్లాడి సీమాంధ్రకు ప్యాకేజీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేలా హామీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు సాధ్యం కాని సవరణలు కోరడం అటు కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడమేకాక ఇటు బీజేపీ నాయకులకు కూడా ఆగ్రహం వచ్చేలా చేసింది. సుష్మాస్వరాజ్ ఈ విషయంలో తీవ్ర అసహనానికి గురయ్యారని సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు గురువారం సభలో అందుబాటులో ఉండి ఓటింగ్ లో పాల్గొనాలని విప్ జారీ చేసింది. ఏది ఏమైనా గురువారం మధ్యాహ్నం కల్లా బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *