ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణ నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, మన కాలనీలు శుభ్రంగా ఉంటే ఆ గౌరవం మనకే కదా.. ఉన్నంతలో గొప్పగా బతకాలి. మన సమాజాన్ని, మన ఇంటిని, మన బస్తీని ఎవరూ బాగు చేయరు. ఉన్న అథారిటీలు, ప్రభుత్వం, పురపాలక శాఖ వాళ్ళు కొంత చేస్తారు. కానీ ఎక్కువ చేసుకోవాల్సింది మనమే. అనుకుంటే మనం ఏదైనా చేయగలం. లోపల ఉన్న శక్తి ఏంటో మనకు తెల్వదు.. ఒక వేలితో కొడితే దెబ్బ తగలదు. అదే పిడికిలితో కొడితే దెబ్బ బాగా తగుల్తది. ఆ శక్తి మనకు వస్తే ప్రజలు అందరూ కలిస్తే ఎంతటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని అన్నారు.
పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు హైదరాబాద్ పరిస్థితి ఉందని, కేవలం మన ఇల్లే కాదు, మన బస్తీ కూడా శుభ్రంగా ఉండాలనుకోవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కేసీఆర్ సూచించారు. త్వరలోనే హైదరాబాద్ ను 330 విభాగాలుగా విభజిస్తున్నామని, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులంతా తలా ఒక అభివృద్ధి పని చేపడతామని, మొత్తానికి క్లీన్ బస్తీగా తయారు చేయాలన్నారు. ముఖ్యమంత్రి అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, డీజీపీ అయినా సరే వీళ్ళంతా ప్రజల కోసమే కానీ ఆకాశం, భూమి కోసం కాదని సీఎం స్పష్టం చేశారు.
కాలనీవాసులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తానని, 400-500 గజాల స్థలం కొని అందులో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పోలీసులు మెయిన్ రోడ్లపై పదివేల కెమెరాలు పెడుతున్నారని, కాలనీల్లో కాలనీవాసులే కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మమతానగర్ లో కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా కంట్రోల్ రూంను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ఎం రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.