mt_logo

టీఆర్ఎస్ లో చేరిన పలువురు నేతలు..

మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ ఈ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరే కాక ప్రముఖ హాస్యనటుడు బాబూ మోహన్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి రచించిన జంబి త్రైమాసిక పత్రికను కేసీఆర్ ఆవిష్కరించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ తోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నే గెలిపించాలని అన్నారు. నల్గొండ ప్రజల సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సినీ నటుడు బాబూ మోహన్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాబూ మోహన్ టీఆర్ఎస్ లో చేరడం తనకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వంలో ముందుకు పోదామని, ఎవరెన్ని శాపాలు పెట్టినా నూరు శాతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేసీఆర్ తెలంగాణ ప్రజలనుద్దేశించి చెప్పారు. తెలంగాణ తలరాత మారాలంటే పాట ప్రభుత్వాల వల్ల కాదని, తెలంగాణ సార్ధకం కావాలంటే కొత్త ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఆకాశం నుండి ఊడిపడలేధన్నారు, తెలంగాణలో అన్ని కష్టాలకు ఈ రెండు పార్టీలే ప్రధాన కారణమని వివరించారు. డబ్బులకు, తాయిలాలకు ప్రజలు మోసపోవద్దని, కోటి ఎకరాలకు నీరు అందించే బాధ్యత నాదని, తెలంగాణ పచ్చబడాలని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం కేకే ఇంట్లో టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *