mt_logo

నమస్తేతెలంగాణ సీఎండీ లక్ష్మీరాజంను రాజ్యసభకు పంపిస్తా- కేసీఆర్

తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో తనతో ఉండి తెలంగాణ కోసం పోరాడిన నమస్తే తెలంగాణ సీఎండీ లక్ష్మీరాజంను పెద్దల సభకు పంపిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ పత్రిక పెట్టినప్పుడు ఆయన అందించిన సహకారం తానెప్పుడూ మరచిపోనని కేసీఆర్ అన్నారు. శుక్రవారం తమ సమస్యలు విన్నవించడానికి తెలంగాణ బ్రాహ్మణుల సంఘం సభ్యులు కేసీఆర్ ను కలిసి ఒక మెమొరాండం ను అందజేశారు. వారి సమస్యలపై స్పందిస్తూ, తెలంగాణ అనాథగా ఉన్నప్పుడు ఒక టీవీ, పత్రిక కావాలనుకున్నప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక కోసం తన డబ్బులు పెట్టుబడి పెట్టి సహకారం అందించిన నమస్తే తెలంగాణ సీఎండీ రాజంను మరచిపోనని, ఆయనను తప్పకుండా రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బ్రాహ్మణులకు రాజకీయంగా తగిన అవకాశాలు కల్పిస్తామని, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కొడుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి, నిర్మల్ నుండి వేణుగోపాలాచారి, నల్గొండ నుండి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారని, వారంతా తప్పకుండా గెలుస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల్లో కొంతమందిని ఎమ్మెల్సీలుగా తీసుకుంటామని, రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో భాగస్వామి అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ, అర్చక సమితి అధ్యక్షుడు భానుమూర్తి మాట్లాడుతూ, 2004నుండీ తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని, కేసీఆర్ ఉద్యమస్ఫూర్తి వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. బ్రాహ్మణుల్లో కూడా బీదవర్గాలున్నాయని, వారిని వెనుకబడిన వర్గాలుగా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్ లో సెటిల్ అయినబ్రాహ్మణులంతా కేసీఆర్ కే మద్దతిస్తున్నారని, సీమాంధ్ర బ్రాహ్మణులు కూడా టీఆర్ఎస్ తోనే ఉంటామని, మల్కాజిగిరి గానీ, మేడ్చల్ లో గానీ సీటు తెచ్చుకుంటే గెలిపిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ను కలిసిన వారిలో చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు సౌందరరాజన్, వరంగల్ జిల్లా అర్చక సమితి అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ యువజన నాయకులు ద్రోణంరాజు రవికుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *