విజయవాడ శివార్లలోని ఆటోనగర్ లో లగడపాటి మీద తెలంగాణ వ్యతిరేక ఆందోళనకారులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఆటోనగర్ లారీ ఓనర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యాంధ్ర దీక్షా శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన లగడపాటిని రాజీనామా చేయాలని అక్కడ కొందరు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగడపాటికి, అక్కడున్నవారికి మాట మాట పెరిగింది. అది చివరికి తోపులాటకు దారితీసింది.
గొడవ ముదరకుండా లగడపాటిని అక్కడినుండి తరలించడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగానే కొందరు ఆందోళనకారులు రాళ్ళు, చెప్పులతో లగడపాటి కాన్వాయ్ పై దాడిచేశారు. లగడపాటి అనుచరులు, ఆందోళనకారులు కుర్చీలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. రాళ్ల దాడిలో లగడపాటి కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.
మొత్తానికి సమైక్యాంధ్ర ఛాంపియన్ అని భావించుకునే లగడపాటికి స్వంత నియోజకవర్గంలోనే, తన ప్రజల చేతిలోనే శృంగభంగం అయ్యిందన్నమాట.