mt_logo

ఇష్టానుసారంగా బూతులు తిడుతూ మమ్మల్ని కొట్టారు: మానవ హక్కుల కమీషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమీషన్‌ను లగచర్ల బాధిత రైతులు కలిశారు. ఈ సందర్భంగా లగచర్ల బాధితులు మాట్లాడుతూ.. మా భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా మేము చాలా ధర్నాలు చేస్తున్నాం. మేము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదు అని ఆక్షేపించారు.

కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారు. ఆ దాడిని సాకుగా చూపి అర్థరాత్రి రాత్రి 500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి మాపై దౌర్జన్యం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

కుతిక పిసికి, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కొట్టారు. మగవాళ్లందరని అరెస్ట్ చేశారు. మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి పారిపోయారు. మేము మా భూములు ఇవ్వమని చెబుతున్నా. మా భూములను వదిలేయాలి. మా వారిని వదిలేయండి అని వేడుకున్నారు.

మాకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటా అంటే మేము ఎలా బతకాలి. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోంది. మా ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారు. ఎనిమిది రోజులుగా మా పిల్లలు ఎక్కడున్నారో తెలియదు వారిని కూడా తీసుకెళ్తామని చెబుతున్నారు అని పేర్కొన్నారు.

కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము చాలా బాగా బతికాం. గత 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మా ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వం. రేవంత్ రెడ్డిని గారి కలిసేందుకు వెళ్తే మమ్మల్ని బెదిరించి పంపించారు అని అన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారు అని విమర్శించారు.

9 నెలలుగా తమ భూములు ఇవ్వమని రైతులు చెబూతునే ఉన్నారు. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది దాడి చేశారు. దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. అర్థరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్నెట్ బంద్ చేసి మహిళలను హింసించారు, కొట్టారు, బూతులు తిట్టారు అని అన్నారు.

51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారు. మళ్లీ ఏం చేస్తారోనని భయపడుతున్నారు. తమకు అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుంది అని తెలిపారు.

ఇప్పటికీ కూడా పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంకా అరెస్ట్‌లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు బాధితులకు ఉరి శిక్ష పడుతుందని బెదిరిస్తున్నాడు. మీ భూములు గుంజుకుంటామని చెబుతున్నాడు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడకు వచ్చాం. జాతీయ మానవహక్కుల కమీషన్‌ను కలిసి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై వివరించాం అని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, మహిళ కమీషన్‌ను కూడా కలుస్తాం. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. రాష్ట్రపతి గారు కూడా ఆదివాసీ బిడ్డే. ఆమె మాకు సమయం ఇస్తే వారికి కూడా ఈ సంఘటనను వివరిస్తాం. కొద్ది రోజులుగా బాధితులు ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. లగచర్ల బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటాం అని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ మాలత్ కవిత మాట్లాడుతూ.. తాతాలు, తండ్రుల వారసత్వంగా వచ్చిన భూములను ఫార్మా కంపెనీ ఇవ్వాలని అంటున్నారు. ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం ఇప్పటికే భూములు సేకరించింది. దాన్ని కాదని గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడు అని దుయ్యబట్టారు.

కానీ లగచర్లలో మా తండా వాసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. 90 శాతం లంబాడాలు మద్దతు ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు.

మా గిరిజనుల భూముల జోలికి రావద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. లగచర్ల బాధితులకు గిరిజన బిడ్డలందరం అండగా ఉంటాం అని అన్నారు.