ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వమే మొత్తం డబ్బు ఇస్తుందని, ఎవరూ ఒక్క రూపాయికూడా ఇచ్చే పనిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను మురికివాడలు లేని నగరంగా అద్దంలా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ళకు ఎవరైనా లంచం అడిగితే తోలు తీస్తానని హెచ్చరించారు. ఆదివారం వరంగల్ లోని లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్ నగర్, దీనదయాళ్ నగర్, ప్రగతి నగర్, అంబేద్కర్ నగర్ మురికివాడల గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదలకు నిర్మించబోయే పక్కా గృహాలకు సీఎం కేసీఆర్ పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నగరంలో మరో రెండు షాదీఖానాలు నిర్మిస్తామని, కూరగాయలు, మాంసం మార్కెట్లను అధునాతన రీతిలో ఏర్పాటుచేస్తామని చెప్పారు.
గృహనిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తానని, మరో పదిరోజుల్లో తిరిగి నగరానికి వస్తానని, ఇండ్లకోసం మొత్తం పైసలు మంజూరు చేశానని, మీరు ఎవరికీ ఒక్క రూపాయి ఇచ్చే పనిలేదని, ఎవరన్నా లంచం అడిగితే నాకు ఫోన్ చేయండి.. నా ఫోన్ నం. 040-23454071. దీనికి ఫోన్ చేస్తే ఏం పైసలు పడవు.. సీఎం ఆఫీసుల హెల్ప్ లైన్ పెడతా.. ఆ పైసలు అడుగుడేందో, మీరు ఇచ్చుడేందో అన్నిటి సంగతి తేలుస్తా.. అంత పెద్ద తెలంగాణ సాధించుకున్న మనం ఈ కాలనీలను బాగుచేసుకోలేమా? ఓపిక కావాలి. కమిట్ మెంట్ తో పనిచెయ్యాలి కానీ వాడికి పైసలు ఇస్తే పనైతదని ఎక్కడెక్కడికో వెళ్లి ఆగం కావొద్దని సీఎం స్పష్టం చేశారు.