ఏపీ సీఎం చంద్రబాబుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన కరెంటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది ముందుచూపు కాదని.. కుట్ర చూపని విమర్శించారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తున్న బాబు.. అదే చట్టం ప్రకారం కృష్ణపట్నంలో తెలంగాణకు 54 శాతం కరెంటును మాత్రం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేతలు చేస్తున్నది బస్సు యాత్ర కాదని.. చంద్రబాబు బానిసల యాత్ర అని విమర్శించారు.
-తెలంగాణకు కరెంటు రాకుండా అడ్డుకుంటున్నాడు
-సెక్రటేరియట్‌లో ఏ హక్కుతో కూర్చుంటున్నావు?
-చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు
-టీ టీడీపీ నేతలది బాబు బానిసల యాత్రన్న మంత్రి ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, ప్రభాకర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డితో కలిసి హరీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం, లోయర్ సీలేరుతోపాటు సాంప్రదాయేతర విద్యుత్‌లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను రాకుండా చంద్రబాబు ఎలా అడ్డుకుంటున్నారో ఆధారాలతో సహా వివరించారు. ఆంధ్రలో ఉత్పత్తయిన కరెంటు తెలంగాణకు ఎందుకివ్వాలన్న బాబు నిజస్వరూపం బయటపడిందని హరీష్ అన్నారు. ఇన్ని కుట్రలు చేస్తున్నా బాబును ప్రశ్నించాల్సిన టీటీడీపీ నేతలు బస్సు యాత్ర చేయడంపై మండిపడ్డారు. ఆంధ్ర బాబు రాసిచ్చిన స్క్రిప్టు పట్టుకొని ఆత్మవంచన చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు పరామర్శ యాత్రను విహారయాత్రలా చేస్తూ ఫొటోలకు పోజులిస్తున్నారని.. తెలంగాణ బిడ్డల్లాగా కాకుండా ఆంధ్ర బాబు బానిసల్లాగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలపై హరీష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బానిస సంకెళ్లు తెంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా.. టీడీపీ నేతలు మాత్రం సీమాంధ్ర నాయకుల కనుసన్నల్లో మెలుగుతున్నారని.. వీళ్లను ప్రజలు క్షమించరన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఉమ్మడి రాష్ట్రంలోనే పీపీఏలు చేసుకున్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు చెందిన ఎన్‌పీసీడీఎల్, సీపీడీసీఎల్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు 45 శాతం అంటే రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఈ లెక్కన 26 శాతం కరెంటు మాకు రావాలి. మా పెట్టుబడులు పెట్టి నిర్మించిన కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి మా వాటా కరెంటు ఇవ్వండి అంటూ చంద్రబాబును హరీష్ నిలదీశారు. దీనికి సంబంధించి తెలంగాణ జెన్‌కో చైర్మన్ ప్రభాకరరావు ఈ ఏడాది సెప్టెంబర్ 27న కృష్ణపట్నం కేంద్రంలో 54 శాతం తెలంగాణ వాటా ఉందని లేఖ రాసినా దానికి ఎందుకు సమాధానమివ్వలేదని ప్రశ్నించారు. 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తయ్యే లోయర్ సీలేరు తెలంగాణకు దక్కకుండా ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుకున్నారని హరీష్ ఆరోపించారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇందులోనూ తెలంగాణకు 54 శాతం వాటా దక్కాల్సి ఉన్నా.. ఒక్క మెగావాట్ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. సంప్రదాయేతర విద్యుత్‌లోనూ తెలంగాణకు ఒక్క మెగావాట్ కూడా దక్కలేదని హరీశ్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం, కర్నూల్‌లలో 400 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాలు నెలకొల్పారని.. అవి అంతకుముందు తెలంగాణకు చెందిన సీపీడీసీఎల్ కింద ఉన్నాయని తెలిపారు. అయినా ఇందులోనూ ఒక్క మెగావాట్ కూడా తెలంగాణకు దక్కలేదని.. ఇది చంద్రబాబు మోసం కాదా అని ప్రశ్నించారు.
ఎర్రబెల్లి.. ముక్కు నేలకు రాస్తావా?
ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాత్రం చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తనని అంటున్నడు. మరిప్పుడు ముక్కును ఎక్కడ నేలకు రాస్తవ్? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు రాస్తవా? అంటూ హరీష్ ప్రశ్నించారు. మీకు చేతగాకపోతే మాకు అధికారం ఇయ్యండంటున్నారు. మీకు చేతగాకనే తెలంగాణ ప్రజలు మూడుసార్లు ఓడగొట్టి ఇంటికి పంపిండ్రు అని హరీశ్ పేర్కొన్నారు.
మా రైతుల కోసం ఎంతపెట్టయినా కొంటాం..
కరెంటును యూనిట్‌కు రూ. 8.50 చొప్పున ఎక్కువ ధర పెట్టి కొంటున్నారని బాబు అంటున్నడు. మేం ఇప్పుడు కాదు జూన్ నుంచి కొంటున్నం. పంటలు పొట్టదశకొచ్చినయి.. అవసరమైతే ఎక్కువ ధరకైనా కొనాలనుకొంటున్నం అని బాబుకు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్‌కు సరిపడా విద్యుదుత్పత్తి ఉందని.. తెలంగాణలో మాత్రం కొరత ఉన్నందువల్ల వెయ్యి మెగావాట్లు బయటి నుంచి కొంటున్నామని హరీష్ తెలిపారు.
ఏపీ ప్రజలే కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారు
నాలుగు నెలల్లో 120 కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని.. కేసీఆర్ పాలన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే మెచ్చుకుంటున్నరని హరీష్ తెలిపారు. తెలంగాణ భవన్‌కు ఆంధ్ర ప్రజలు ఎంతోమంది లెటర్లు రాస్తుండ్రు, ఈమెయిల్స్ పంపుతున్నరు. కానీ నిన్ను ఎవరు మెచ్చుకుంటున్నరు? నీ లోకేష్ బాబు ఒక్కడే ట్విట్టర్‌ల ప్రశంసిస్తుండు అని అన్నారు. రాజధాని నిర్మాణానికంటూ ఆంధ్ర అక్క చెల్లెళ్ల ఒంటి మీది నగలన్నీ బాబు తీసుకుంటున్నారని.. ఆయన మాత్రం రేపోమాపో ఖాళీ చేయాల్సిన కార్యాలయానికి రూ.15 కోట్లు పెట్టి మరమ్మతులు చేసుకుంటున్నారని విమర్శించారు. నీకో పర్మినెంట్ హెలికాప్టర్.. నువ్వు వాడుకున్నా, వాడుకోకున్నా విమానాశ్రయంల అద్దెకు ఒక విమానం. ఆంధ్ర మహిళల చేతుల గాజులు ఒలుచుకొని నువ్వు చేస్తున్నది ఇదా? అంటూ బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మా మంజీర, గోదావరి నీళ్లు తాగే హక్కు ఎక్కడిది?
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని అని హైదరాబాద్ సెక్రటేరియట్‌ల కూర్చుంటున్నవు. మరి విద్యుత్ ఉత్పత్తిల తెలంగాణకు అన్యాయం జరిగిందని.. అదే పునర్‌వ్యవస్థీకరణ చట్టంల 54 శాతం వాటా ఇయ్యాలని ఉంది. మరి మేం నిజాయితీగ నిన్ను కూర్చోనిచ్చినపుడు నువ్వు కూడా నిజాయితీగ మా వాటా మాకియ్యాలి కదా. లేకుంటె నీకు సెక్రటేరియట్‌ల కూర్చునే హక్కు ఎక్కడిది? అని హరీశ్ చంద్రబాబును ప్రశ్నించారు. మంజీరా, గోదావరి నీళ్లు తాగే హక్కు బాబుకు ఎక్కడిదని.. తాము విజ్ఞతతో వ్యవహరిస్తున్నా.. బాబు విజ్ఞత ప్రదర్శించడం లేదని హరీష్ విమర్శించారు. ప్లాంటు ఆంధ్రల ఉంటె తెలంగాణకు కరెంటు ఎట్లిస్తరని బాబు అంటున్నడు. మరి కృష్ణ, గోదావరి నదులు 70 శాతం తెలంగాణల ప్రవహిస్తున్నయి కదా. ఈ ప్రాతిపదికన ఆ జలాల్లో 70 శాతం ఇస్తవా? అంటూ బాబును నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని కృష్ణపట్నం, లోయర్ సీలేరు, సంప్రదాయేతర విద్యుత్‌లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా ఇప్పించాలని కోరారు.
Source: [నమస్తే తెలంగాణ]