
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తాజా మాజీ సర్పంచ్‌లు తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసి, తమ సమస్యలను వినిపించారు. వారు తమ పదవి కాలంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి కేటీఆర్‌ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించవలసిందిగా అభ్యర్థించారు.
తమ పదవి కాలంలో పల్లె ప్రగతి, రైతు వేదిక, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనము తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని మాజీ సర్పంచులు తెలిపారు.
గత సంవత్సరం కాలంగా ఈ బిల్లుల విడుదల కోసం తమ వంతు పోరాటం చేస్తూనే ఉన్నామని, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రాక చాలా మంది సర్పంచులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అప్పుల భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భార్య పిల్లలపై ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి, భూములను అమ్ముకొని, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తమ పరిస్థితిని వారు వివరించారు. గ్రామాల్లో తిరగలేక, తలెత్తుకొని నడవలేని స్థితికి చేరుకున్నామని వారు కేటీఆర్ గారికి మొరపెట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా తమకు రావాల్సిన బిల్లులను విడుదల చేయకపోవడం బాధాకరమని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. బిల్లుల విడుదల కోసం అనేకసార్లు ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా, ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని, తమ ఆవేదనను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తవలసిందిగా కేటీఆర్ గారిని కోరినట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం కేటీఆర్ గారి ఆదేశాలతో తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లెవనెత్తుతామని కెటిఅర్ హమీ ఇచ్చారు.