mt_logo

ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచిన ఘనత కేసీఆర్‌దే: బీడీఎల్ నాయకులతో కేటీఆర్

తెలంగాణ భవన్‌‌లో బీడీఎల్ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిలో కుంగిపోకూడదు, గెలుపులో పొంగిపోకూడదు అని కేసీఆర్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేధావులు, నిపుణులతో కలిసి మన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు రూపొందించింది. సింగరేణి వంటి సంస్థకు ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు అందించిన ఘనత కేసీఆర్ గారిదే అని కొనియాడారు.

కేంద్రంలోని బీజేపీ పాలన పబ్లిక్ సెక్టార్ సంస్థలను ఆదాని వైపు నడిపింది, ఇది బాధాకరం. బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టమంటే దానికి అవసరం అయినా గనిని మొత్తం ఆదానికి రాసిచ్చారు. రైతు కుటుంబాలను ఆర్థిక భద్రత కల్పించే ఐదు లక్షల బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది అని గుర్తు చేశారు.

ఇది దేశంలోనే అత్యుత్తమ పథకంగా నిలిచింది. ఈ బీమాను ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ద్వారా నిర్వహించి, ప్రభుత్వ రంగ సంస్థను బలపరిచిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఎల్ఐసీ కంపెనీకి ఇచ్చి ప్రభుత్వ కంపెనీని కాపాడడం ఆనాడు జరిగింది. ఈనాడు ఎల్ఐసీకి అతిపెద్ద కస్టమర్ తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.

కేవలం ఒకే సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ప్రజలు కాంగ్రెస్ పాలనలో నిరాశకు గురవుతున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు.

రైతులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, లగచర్ల భూముల రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే, వారిపై అణచివేత చర్యలు తీసుకోవడం దారుణం. సామాన్య ప్రజల హక్కులను హరిస్తున్న కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ భవన్‌ను ప్రజాసమస్యల పరిష్కార కేంద్రంగా జనతా గ్యారేజ్‌గా మారింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై తెలంగాణ భవన్‌కు వస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

జనవరి మొదటి వారంలో కార్మికుల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించి, బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి సహకరించే విధంగా కార్యాచరణ రూపొందించి ఒక క్యాలెండర్ ఓపెన్ చేస్తాం అని అన్నారు.