సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇవ్వాళ రాజ్యాంగ దినోత్సవం. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైంది. అందుకే తెలంగాణ ప్రజలంతా ఆయనకు రుణపడి ఉంటారు అని అన్నారు. బాబా సాహెబ్ చూపిన బాటలోనే బోధించు, పోరాడు, సమీకరించు అన్న విధానంలోనే కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ సాధించారు అని గుర్తు చేశారు.
పదవి త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి.. ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ గారు అని మాజీ స్పీకర్ మధుసుధానాచారి గారి అన్నారు. అది వంద శాతం నిజం. తెలంగాణ ఇప్పుడు రాష్ట్రంగా ఉండి.. కాంగ్రెస్ వాళ్లు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటే దాని కేసీఆర్ అనే నాయకుడే కారణం అని పేర్కొన్నారు.
కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చూపే ప్రయత్నం చేసినప్పటికీ.. తెలంగాణ ప్రజలు ఆయనను ఎన్నటికీ మరవరు. రాజకీయంగా కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తారు. మనకు కొన్ని కష్టాలు రావచ్చు. రాజకీయంగా గానీ జీవితంలో కానీ ఎత్తు పల్లాలు సహజం.. తప్పవు అని అన్నారు.
గతేడాది ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారో మీకు గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపటంతో కొన్ని చోట్ల ప్రజలు నమ్మి వాళ్లను గెలిపించారు. ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఎవరినీ కదిలించిన సరే ఒక్కటే మాట కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని వస్తోంది అని వ్యాఖ్యానించారు.
సంపన్న వర్గాల నుంచి రైతులు, నేతన్నలు, ఆటోడ్రైవర్లు అట్టడుగు వర్గాల వరకు అందరి నోట ఇదే మాట. నేతన్నల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యల సాక్షిగా చెబుతున్నా.. ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. వాళ్లు చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు అనే అర గ్యారంటీ మాత్రమే అమలైంది అని విమర్శించారు.
నేను ఏదీ మాట్లాడినా సరే.. నన్ను ఎందులోనైనా పట్టుకొని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. మా అక్క చెల్లెలు, అన్నదమ్ముల అండ ఉన్నంత వరకు ఎవ్వని అయ్యకు కూడా భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేస్తా. ఇక్కడి కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. మా పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడంట. ఇటువంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మీరు ఎవ్వరూ భయపడవద్దు. వీళ్లు టీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోండి. కాంగ్రెస్ కార్యకర్తల్లాగ వ్యవహరిస్తే మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా. నేనే ఆ బాధ్యత తీసుకుంటా. నేను ఖచ్చితంగా ఆ పనిచేసి చూపిస్తా అని భరోసా ఇచ్చారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సరే బీఆర్ఎస్ భారీ విజయం సాధించటం ఖాయం. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే ఆయన పదవి ఊడుతది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. సిరిసిల్లలో ప్రజలు ఛీ కొట్టిన సరే అధికారులను అడ్డం పెట్టుకొని ఎగురుతున్న కాంగ్రెస్ సన్నాసులను గుర్తుపెట్టుకుంటాం అని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ ముఖ్యమంత్రి మొన్న వేములవాడకు వచ్చిండు. నాలుగు మంచి మాటలు చెబుతాడనుకున్నా. బాలల దినోత్సవమైనా, రాజీవ్ సద్భావన యాత్ర అయినా, ఆయన పుట్టిన రోజు అయినా, వేములవాడలో మీటింగ్ అయినా సరే కేసీఆర్‌ను తిట్టటమే పని. దేవుళ్ల మీద ఒట్లు, హామీలకు తూట్లు, కేసీఆర్‌కు తిట్లు.. ఇవి తప్ప నువ్వేం పీకినవ్. ప్రజల దగ్గరకు పోతే జనాలను నిన్ను ఛీ కొట్టే పరిస్థితి ఉంది అని విమర్శించారు.
కొడంగల్‌లో ఏం జరిగింది. అక్కడ రైతులకు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నీది. మా నేరెళ్లలో కూడా ఒక సంఘటన జరిగింది. అయితే బాధితులకు న్యాయం చేసేందుకు నేను ప్రయత్నం చేశా. వాళ్లను కలిశా. వీలైనంత సాయం చేశా. మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ నెరేళ్ల ప్రజలంతా మొన్నటి ఎన్నికల్లో మాకే అత్యధిక ఓట్లు వేశారు. ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే ప్రజలతో తిట్లు తిన్నా సరే వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి అని సూచించారు.
కొడంగల్‌లో రైతులు ఏమీ అడిగారు. తమ భూములకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కోరారు. 9 నెలలుగా నిరసన చెబుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. వాళ్లకు ఈ ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు..సీఎం తమ్ముడు, మంత్రులు ఎవ్వరూ కూడా వాళ్లు బతిమాలిన పట్టించుకోలేదు. ఆఖరికి కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళితే నిరసన తెలిపారు. అదే రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవాళ్లు అని అన్నారు.
ఈ ముఖ్యమంత్రి కేవలం అదానీ, తన అన్న, అల్లుడు, బావమరిదికి అమృతం పంచేందుకు మాత్రమే పని చేస్తుండు. ప్రజల కోసం ఏమీ చేయలేదు. 28 సార్లు ఢిల్లీకి పోయిండు. ఫ్లైట్ ఛార్జీలు వృథా తప్ప 28 రూపాయలు కూడా తీసుకురాలే. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వాళ్లు కూడా 8 రూపాయల నిధులు కూడా తేలేదు. ప్రజలందరూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పనులను గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్‌తో మాట్లాడితే ఈ ప్రభుత్వం పోయేందుకు ఏదైనా ఉపాయం లేదా అని అడుగుతున్నాడు. ఒకసారి ఓటు వేస్తే ఐదేళ్లు శిక్ష పడాల్నా అంటున్నాడు. తప్పదు మరో నాలుగేళ్లు వీళ్లు పీక్క తింటూనే ఉంటారు. ఈ ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిజ్ఞానం కూడా లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో నేతన్నలు ఉన్నారు. మరి ఇక్కడ పెట్టాల్సిన నూలు డిపోను తీసుకొని పోయి వేములవాడలో పెట్టిండు. గుండుకు దెబ్బ తాకితే మోకాలి మందు పెట్టినట్లు ఉంది. ఇంతా తెలివైన వాళ్లు ఉండటం మన అదృష్టం. ఏడాది పాలనలో ముఖ్యమంత్రిని ప్రజలు ఇన్ని తిట్లు తిట్టటం నేను ఎప్పుడు చూడలేదు అని ఎద్దేవా చేశారు.
మీడియా, యూట్యూబ్ వాళ్లు మైక్ పెడితే చాలు ఏమాత్రం సంకోచించకుండా రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు తిడుతున్నారు. ఆ తిట్లు విన్నాక రేషం ఉన్నోడైతే బిల్డింగ్ మీది నుంచి దూకి చస్తాడు. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతోంది. ఏడాది లోపే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఊహించలేదు. మనం పిలుపునిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజలే సంవత్సరీకం పెట్టే పరిస్థితి ఉంది అని అన్నారు.
అమ్మ విలువ, అన్నం విలువ లేనప్పుడే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు గ్రామ గ్రామాన కేసీఆర్ గారి గురించే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లోని నాచారంలో చెప్పుల దుకాణం, హుజుర్‌నగర్‌లో నాయి బ్రహ్మణుడి షాప్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తుంటే వాళ్లు కేసీఆర్ ఎక్కడ ఉన్నావంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా కాంగ్రెస్‌ను ఎప్పుడు పాతర పెడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
ఇంకొక ఆరు నెలల్లో ఇదే తోక జాడిస్తున్న అధికారులు కేటీఆర్ సర్ ఎక్కడ ఉన్నారంటూ మీకే ఫోన్ చేస్తరు. రాసి పెట్టుకోండి. 2001 నుంచి ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండానే ఎగిరింది. మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఎనలేని వాత్సల్యం, ప్రేమ ఉంది. దాన్ని ఎలా అనుకూలంగా మలుచుకోవాలన్నదే మనం చేయాల్సిన పని అని అన్నారు.
మనుషులుగా మనం కూడా తప్పులు, పొరపాట్లు చేసి ఉండవచ్చు. వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం ఆనాడు ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో’ అని కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ తెచ్చారో గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా మహా సంకల్ప దీక్ష చేయాల్సి ఉంది. తెలంగాణ తెచ్చిన దానికన్నా కేసీఆర్ గారికి వచ్చే పెద్ద పేరు ఇంకేమీ లేదు అని తెలిపారు.
తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ రైతులు, నేతన్నలు, వృద్ధులు, తెలంగాణ ప్రజానీకానికి మేలు జరగాలంటే కేసీఆర్ కావాలి. విడిపోతే చెడిపోతాం అంటూ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక నినాదం బాగా పాపులర్ అయ్యింది. మనం కూడా ఎన్నికలు వస్తే విడిపోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అన్యాయం జరుగుతుంది. తెలంగాణ మీద గులాబీ జెండాకు ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ మాత్రమే తెలంగాణ మట్టి మనిషి అవుతాడు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ మనుషులే అవుతారు. మన నాయకుడి పోరాటం, తెలంగాణ విద్యార్థుల బలిదానాన్ని దీక్షా దివస్ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆనాడు తెలంగాణ ఇయ్యక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు.
నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ అనే బక్క మనిషి, ఉక్కు సంకల్పంతో చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఏర్పాటైన జూన్ 2 వ తేదీ ఎంత ముఖ్యమో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు కీలక మలుపు అయిన దీక్షా దివస్ నవంబర్ 29 కూడా అంతే ముఖ్యం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వ తేదీ వరకు పదకొండు రోజులు జరిగిన దీక్ష కారణంగా అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఏ రోజైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో అదే డిసెంబర్ 9వ తేదీని విజయ దివస్‌గా కూడా జరుపుకుందాం అని పిలుపునిచ్చారు.
- Yadadri Thermal Power Station: A symbol of Telangana’s progress achieved under BRS government
- Revanth govt. abandons, but Tamil Nadu steps up to support Sircilla weavers
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ల సమస్యను లేవనెత్తుతాం: తాజా మాజీ సర్పంచ్‌లతో కేటీఆర్
- లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం: బాధితులతో కేటీఆర్
- అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కోల్పోలేదు: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం
- హరీష్ రావును కలిసిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు
- బూటకపు హామీలతో యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారు: కవిత
- అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్
- సమ సమాజ నిర్మాణ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్