వేసవి సెలవులపై ఒక విద్యార్ధి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సదరు విద్యార్ధి తమ పాఠశాల ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నదని, జూన్ 12 కు బదులుగా జూన్ 1వ తేదీనే పాఠశాలను పునఃప్రారంభిస్తున్నదని ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా జూన్ 1 నుండి 12 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుందని పేర్కొన్నాడు. రాష్ట్రంలో మండుతున్న ఎండల వల్ల స్కూల్ కు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని విద్యార్ధి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ.. వేసవి సెలవుల విషయంలో అన్ని పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు పాటించేలా చూడాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు.