రేవంత్ రెడ్డి అదానీ కలయికపైన వారి కుమ్మక్కుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదానికి అనుచితమైన లబ్ధి చేకూర్చే విధంగా అనేక కుట్రలకు పాల్పడుతున్నారని అయితే ఇదే అదానీని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆదానీతో కొట్లాడుతున్నట్టు నాటకాలు ఆడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టులను, తెలంగాణ వనరులను అదానికి దోచిపెట్టే కుట్రను చేస్తున్నదని.. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను ఎండగడుతామని కేటీఆర్ అన్నారు. బలవంతంగా భూములు గుంజుకుంటున్న వారి పక్షాన పోరాడుతునే ఉంటామని, వారి తరపున ప్రభుత్వాన్ని ఎండగడుతునే ఉంటామని కేటీఆర్ ప్రకటించారు.
పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో ఒక నీతి ఎట్లా ఉంటుందని ప్రశ్నించారు. పార్టమెంటు ప్రోసీజర్స్ దేశమంతా ఒకేవిధంగా ఉండాలన్నారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే రోడ్డు మీద నిలబెట్టారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ ముందు నిలబెట్టడం దుర్మార్గమైని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకతోపాటు 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని బొమ్మ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు కానీ తెలంగాణలో అసెంబ్లీ లోపలికి వెళ్లొద్దని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టేందుకే నిరసన తెలుపుతామని కేటీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్‌కు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు పోలీసులను అడ్డంపెట్టుకొని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ, కౌన్సిల్‌లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష చేయకబోయి ఉంటే, డిసెంబర్ 9నాడు ప్రకటన రాకపోయిఉంటే తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఉండేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీతో రేవంత్ రెడ్డికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతామని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని పేద, చిన్న సన్నకారు రైతుల పక్షాన కొట్లాడుతునే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రధాని, అదానీ ఒకటే అంటూ రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరు అయ్యారని కేటీఆర్ తెలిపారు. అదానీపై నిరసనలు ఢిల్లీలో ఒక రూల్, గల్లీలో ఒక రూల్ ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ, రేవంత్ ల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామంటే..అసెంబ్లీ గేటు వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం కాంగ్రెస్ ద్వంద నీతికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. స్పీకర్ ఆదేశాలు లేకుండా శాసనసభ హక్కులకు కాలరాస్తూ అసెంబ్లీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్న తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ ఆదేశాలతో పని లేకుండా ప్రభుత్వంలోని వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి పాశవికంగా తెలంగాణ భవన్‌కు తరలించడాన్ని కేటీఆర్ ఆకేపించారు. అనంతరం తెలంగాణ భవన్ లో ప్రభుత్వ నిరంకుశత్వం, తెలంగాణ అస్థిత్వంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీతో వ్యాపార లాభాలతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మౌనం వహించిందని.. అందుకు కారణం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తున్న డబ్బు సంచులేనని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికైనా హిపోక్రసీని కాంగ్రెస్ నేతలు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి అదానీతో చేస్తున్న వ్యాపారాలపై ఆ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. ఒకవైపు ఢిల్లీలో కొట్లాడుతూ, గల్లీలో కలిసి పోతామన్న ధోరణిలో కాంగ్రెస్ నాటకాలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి అదానీతో వ్యాపార సంబంధాల పేరిట తెలంగాణ ప్రజల వనరులను దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తాజాగా నల్లగొండ జిల్లా ప్రజల్లో మట్టిగొట్టేందుకు రామన్నపేటలో వేల ఎకరాలను అదానీకి ధారాదత్తం చేసేందుకు స్థానిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇట్లా అదానీకి భూములు కట్టబెట్టేందుకు రేవంత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ విధానాలు, అరాచకపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ నిర్బంధాలకు గురిచేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని నిర్బంధాలు, దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేయడం ఆపబోదని కేటీఆర్ ప్రకటించారు.