హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపుకోసం ప్రచారం చేసేందుకు మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యంలేని టీడీపీ శిఖండి రాజకీయాలు చేస్తున్నదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఆ పార్టీ వెనుకుండి శిఖండి వేషం వేస్తున్న చంద్రబాబుకు వేసినట్లేనని విమర్శించారు. 90 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ ల విభజనను కేంద్రప్రభుత్వంతో తొమ్మిది నెలలు ఆపించి అడ్డంకులు సృష్టించారన్నారు. ఇది కేవలం దేవీప్రసాద్ ఎన్నిక కాదని, మనందరి ఎన్నిక అని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.
అనంతరం మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమంలో పనిచేసిన దేవీప్రసాద్ ను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించాలని పిలుపునిచ్చారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి తాము భాగస్వాములం కావాలని ఆయన వెంట నడుస్తున్నామని అన్నారు.