mt_logo

స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం: కేటీఆర్

త్వరలో స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

పార్టీ మారిన ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైన అనర్హతవేటు ఖాయమని, త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో ఈరోజు కేటీఆర్ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపైన తాటికొండ రాజయ్య పలు సలహాలు, సూచనలు కేటీఆర్‌తో పంచుకున్నారు.

పార్టీని మోసం చేసి, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓడించేందుకు ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులన్నీ కడియం శ్రీహరికి బుద్ధి చెబుతాయన్నారు.

ఇప్పటికే తాటికొండ రాజయ్యని స్టేషన్ ఘన్‌పూర్‌ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన నాయకత్వంలో మరోసారి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ అన్నారు. పార్టీని మరింతగా సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

పార్టీ శ్రేణులతో త్వరలోనే ఒక విస్తతస్ధాయి సమావేశాన్ని స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న మండల పార్టీ నాయకులతో మాట్లాడి తేదీలను నిర్ణయించాలని రాజయ్యకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అనేక అవకాశాలు ఇచ్చిన మూడుచట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించిన తర్వాత కూడా కేవలం రాజకీయ స్వార్థంతో పార్టీని వీడిన కడియం శ్రీహరికి భారత రాష్ట్ర సమితి శ్రేణులు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.