
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కోరింది.
తెలంగాణ భవన్‌లో బుధవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజేస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం తక్షణమే రూ. 650 కోట్ల రూపాయలు చెల్లిస్తే తమ సమస్య చాలా వరకు తీరుతుందని వారు కేటీఆర్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం కారణంగా కాలేజ్ భవనాల అద్దె, స్టాఫ్‌కు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు చెప్పారు. వెంటనే బకాయిలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన కేటీఆర్.. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించేలా ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలోనూ కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
గత ప్రభుత్వాల బకాయిలంటూ దిక్కుమాలిన మాటలు చెప్పకుండా వెంటనే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు అంతకముందున్న ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తాము చెల్లించామని కేటీఆర్ గుర్తు చేశారు.
తప్పకుండా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లించే విషయంలో ప్రభుత్వాని నిలదీస్తామని తనకు కలిసిన కాలేజీ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ యాద రామకృష్ణ సహా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.