mt_logo

బీసీల కోసం బీఆర్ఎస్ కదిలింది.. నవంబర్ 10 తర్వాత పోరాటమే: కేటీఆర్

సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలి.. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. బీసీ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు పర్యటనలు ఉంటాయి అని తెలిపారు.

బీసీ నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీ నేతలతో మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది. తెలంగాణ సర్పంచ్‌ల సంఘం, తెలంగాణ ఎంపీటీసీ జిల్లా సంఘం అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు అని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనవర్గాలకు చేస్తున్న ద్రోహం పైన ప్రధానంగా చర్చించడం జరిగింది. గత ఏడాది నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను పక్కన పెట్టిన కాంగ్రెస్ తీరు పైన చర్చించాం. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని మా పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం  రాష్ట్రంలోని బలహీనవర్గాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. నిలదీస్తాం అని స్పష్టం చేశారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు చేసేదాకా వదిలిపెట్టం.రాష్ట్రంలో సమగ్ర కుల గణన జరగాలని డిమాండ్ చేస్తున్నాము.మాటలకు పరిమితం కాకుండా వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 10 లోగా 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం  ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ హామీని నవంబర్ పదిలోగా నెరవేర్చకుంటే భవిష్యత్తులో పార్టీ తరపున కార్యాచరణ చేపడతాం అని హెచ్చరించారు.

బీసీలకు ఐదు సంవత్సరాలలోపు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. ఈసారి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి బీసీలను మోసం చేసింది. రానున్న బడ్జెట్లో కనీసం 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. బీసీల కోసం ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ మాటకు కట్టుబడి ఉండాలి అని అన్నారు

అత్యంత వెనుకబడిన బలహీనవర్గాలు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు వెంటనే ఆ శాఖకు మంత్రి నియమించాలి. రాష్ట్రంలో కేవలం ఇద్దరూ మంత్రులు మాత్రమే బీసీలకు చెందినవారు ఉన్నారు. వారికి మరిన్ని మంత్రి పదవులు ఇయ్యాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని బలహీనవర్గాలకు సంబంధించిన అనేక అంశాలను విస్తృతంగా చర్చించడం జరిగింది. 22 మంది పద్మశాలి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వారికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకపోవడం కారణంగానే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నేతన్నలను సంక్షేమం నుంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.

చేప పిల్లల పంపిణీ ఆపేసి ముదిరాజులకి, గంగపుత్రులకు ప్రభుత్వం అన్యాయం చేసింది. రాష్ట్రంలోని మత్స్యకారుల పొట్ట కొడుతున్నది. బలహీనవర్గాల కోసం ఏర్పాటుచేసిన గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా ప్రమాణాలు దిగజార్చి వారి విద్యా అవకాశాలను దెబ్బ కొడుతున్నది అని దుయ్యబట్టారు.

గతంలో సింహభాగం సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయే.. 2014, 2018, 2024 ఎన్నికల్లోనూ తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లను బలహీన వర్గాలకు కేటాయించింది బీఆర్ఎస్. గతంలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపింది మా పార్టీయే. 50 మంది కార్పొరేషన్ చైర్మన్‌లను నియమిస్తే 27 మంది బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చాం. బలహీనవర్గాల పట్ల మా నిబద్ధతను మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాం అని గుర్తు చేశారు.

బలహీనవర్గాల విద్య కోసం గురుకులాలలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ విద్య పథకాన్ని అందించాం. బలహీనవర్గాల విదేశీ విద్యా నిధి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపింది భవిష్యత్తులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటాం అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని బలహీనవర్గాలకు పెద్దదిక్కుగా మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ఉంటారు. రాష్ట్రంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేను 24 గంటల్లో పూర్తి చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుల గణన చేయడం పెద్ద కష్టమైన అంశమే కాదు.. కానీ చిత్తశుద్ధి లేకనే ఈ అంశం పైన ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదు అని విమర్శించారు.

త్వరలోనే బలహీనవర్గాలకు సంబంధించిన సమస్యలపైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో పార్టీ విస్తృతమైన కార్యాచరణను పార్టీ అధ్యక్షులతో మాట్లాడి ప్రకటిస్తుంది. పార్టీలోని బలహీనవర్గాల నేతలు వర్కింగ్ గ్రూపులుగా విభజించి బీసీల సమస్యలు వాటి పరిష్కారాలు, ప్రత్యక్ష పోరాటాలపైన పనిచేస్తాయి అని ప్రకటించారు.

బీసీ విద్యార్థులకు కనీసం సరైన అన్నం పెట్టలేని పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం ఉన్నది. బలహీనవర్గాలకు సంబంధించిన అన్ని సమస్యలపైన పార్టీ బృందాలుగా విడిపోయి ఎక్కడికి అక్కడ పరిశీలన చేస్తుంది. ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన సలహాలు సూచనలు ఇస్తాం. ఈ పర్యటనల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి.. పరిష్కారానికి ఒత్తిడి తీసుకొస్తాం అని తెలిపారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు. ఒకప్పుడు ఇదే ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రులు కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలను కాపాడాయి.48 మంది పిల్లలు, 14 మంది బాలింతలు ఒక్క ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? అని అడిగారు.

ఆ సమస్యను సరి చేయాల్సింది పోయి కుంటి సాకులు చెప్పడం బాధాకరం. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ విజృంభిస్తున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ లేదు. కేవలం తమ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డారు.

జమిలీ ఎన్నికల విషయంల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో స్పష్టత ఇవ్వాలి. జమిలీ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించబోతుందో మరిన్ని వివరాలు ఇవ్వాలి. తన వైఖరిని విడమర్చి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేశారు

జనాభా లెక్కలతో పాటు సీట్ల విభజన, రీఆర్గనైజేషన్ జరగాలి. బీఆర్ఎస్  పార్టీ కూడా జమిలీ ఎన్నికల పైన ఒక పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది అని కేటీఆర్ అన్నారు.