mt_logo

కొండా సురేఖ వ్యాఖ్యలు నాతో పాటు పార్టీకి నష్టం కలిగించాయి: నాంపల్లి కోర్టులో కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు.

తనపై కొండా సురేఖ చేసిన కామెంట్లను చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వాటిని విని షాక్ గురయ్యానని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని వారు కూడా ఈ వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డారని చెప్పారు. 

బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని కోర్టుకు చెప్పారు.

నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని చెప్పలేకపోతున్నానని ఫిర్యాదు లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ కోర్టును కోరారు.

దాదాపు అరగంట పాటు కోర్టులో కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్‌ను కూడా కోర్టు నమోదు చేసుకుంది. మిగతా సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్‌ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.

గతంలోనూ కేటీఆర్‌పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఆమె తీరుపై మండిపడింది. అయినప్పటికీ కొండా సురేఖ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అవే ఆరోపణలు చేయటంతో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చారు. మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోటవంతో కొండా సురేఖ పై పరువు నష్టం దావా కేసును కేటీఆర్ ఫైల్ చేశారు.

ఈ నెల 21 నే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉన్నప్పటికీ కేటీఆర్ అభ్యర్థన మేరకు గురువారం వరకు కోర్టు సమయమిచ్చింది. ఇవ్వాళ మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ సహా ఈ కేసులో సాక్షులుగా ఉన్న దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బాల్క సమన్, మాజీ మంత్రి జగదీష్ తో పాటు బీఆర్ఎస్ నేతలు నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. కేటీఆర్, దాసోజు శ్రవణ్‌ల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది.