తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ పనులను వెంటనే మొదలుపెట్టాలని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో, డిస్కంల ఎండీలు, ఆర్‌డబ్ల్యూఎస్ ప్రాజెక్టు ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, విద్యుత్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తాగునీటి సరఫరా ప్రాజెక్టును అనుకున్న సమయంలో పూర్తిచేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫలాలు మూడేళ్ళలో ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్ స్టేషన్ వివరాలు విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే ఇవ్వాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మొత్తం ప్రాజెక్టుకు 200 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని, ఇందుకోసం విద్యుత్ శాఖకు ఇప్పటికే రూ. 100కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని తెలిపారు. వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు శాఖలు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. విద్యుత్ పనులు చేపట్టేందుకు షార్ట్ టెండర్ విధానాన్ని అనుసరించాలని, నిధుల కొరత లేనందున పనులు పూర్తిచేయడం పైనే దృష్టి సారించాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీ సురేందర్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.