తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్ పై ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ హబ్ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సీఈవో రవినారాయణ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ అయిదేండ్లుగా దేశ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో టీ హబ్ తనదైన ముద్ర వేసిందని, టీ హబ్ ద్వారా ఔత్సాహికులకు అందిస్తున్న అద్భుత సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలని సూచించారు. ఐటీని విస్తరించే క్రమంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోనూ టీ హబ్ సేవలను విస్తృతం చేయాలని అన్నారు. టీ హబ్, వీ హబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, టాస్క్ తదితర ఆర్గనైజేషన్లతో తెలంగాణలో మంచి ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఏర్పడిందని అన్నారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఆవిష్కరణలు మరిన్ని జరగాల్సిన అవసరం ఉందని, గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు కృషి చేస్తున్న వారికి అవసరమైన మద్దతు అందిస్తామని చెప్పారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాలు గ్రామీణ యువత, విద్యార్ధుల ఆలోచనలను ప్రోత్సహించేలా కొనసాగించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇందుకోసం విద్యాశాఖతో కలిసి పనిచేయాలని చెప్పారు. టీ హబ్ ద్వారా టెక్ ఇన్నోవేషన్ తో పాటు రూరల్, సోషల్ ఇన్నోవేషన్లపై కూడా దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.