రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అని, రాష్ట్రంలో కనీస వసతుల కల్పనకు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారని, అభివృద్ధి, సంక్షేమం కలగలిపి ముందుకు పోతున్నారని అన్నారు. ఇంటింటికి మంచినీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, ఇంటింటికి ఏడాదిలో మంచినీరు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ప్రజలకు మేలు జరగాలంటే కొంత సమయం కావాలి, కానీ ప్రతిపక్షాలు అవేవీ పట్టనట్లు పెడబొబ్బలు పెడ్తున్నాయని, ప్రతిపక్షాలు అంత సిపాయిలు అయితే అన్ని ఏళ్ళు పాలించిన మీరు ఎందుకు తాము చేసిన పనులు చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని, ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళు ఉంది కాబట్టి అప్పుడు ధర్నాలు చేయండని కేటీఆర్ సూచించారు. అప్పుడు మీరు చేసే ధర్నాలకు మేం సమాధానాలు చెప్తాం.. మీరు ఇప్పుడు ఇట్లాగే ధర్నాలు చేస్తే మేం చేసేది మేం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.