రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచాల్సింది పోయి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలన్న రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఐటీ, పంచాయితీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవురోజు బంద్ కు పిలుపునిచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. బంద్ ల పేరుతో రాబందులు వస్తున్నాయని, రైతుల శవాలపై రాజకీయ పార్టీలు పేళాలు ఏరుకుంటున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్ పై స్పందించారు. రైతు ఆత్మహత్యలపై విపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని, గతంలో కరెంట్ అడిగిన రైతులను కాల్చిచంపి రైతులపై లాఠీఛార్జీ చేయించిన ఘనత టీడీపీ దేనని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయిన విషయం మర్చిపోయారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల 60 ఏళ్ల పాలనలోని పాపాలే నేటి రైతు ఆత్మహత్యలకు కారణం అని, బతికున్న వాళ్ళను కూడా పీక్కుతినే రాబందుల్లా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని, రైతులపై వారికి నిజంగా ప్రేమ ఉంటే వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే శనివారం బంద్ కు పిలుపునిచ్చాయని, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఐక్యత రాగం అందుకున్నాయన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కలువని జెండాలు ఇప్పుడు ఎలా కలుస్తున్నాయో ప్రజలు, రైతులు ఆలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు.