దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లింది.. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని బీహార్ తీర్పు మరోసారి స్పష్టం చేసిందని పంచాయితీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీహార్ ప్రజలు బీజేపీకి తగిన శాస్తి చేసి చెంప చెళ్ళుమనిపించారు.. ప్రధాని మోడీ రైతు వ్యతిరేక విధానాలకు బీహార్ ప్రజలే కాదు, రేపు తెలంగాణ ప్రజలు కూడా చరమగీతం పాడుతారని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం హన్మకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు విభజనను మూడునెలల్లో పూర్తి చేయిస్తామని కేంద్ర మంత్రులు ఇక్కడ ప్రచారం చేశారని, కానీ నేటికీ దానిని అమలుచేయలేదని విమర్శించారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ముంపు గ్రామాల పేరుతో ఏపీలో కలిపారని కేటీఆర్ మండిపడ్డారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి లక్షా 25 వేల ప్యాకేజీ ప్రకటించినా ప్రజలు నితీశ్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నమ్మి ఓట్లేశారన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు చైతన్యవంతమైన పాత్రను పోషిస్తారని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో 16 నెలల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అచంచలమైన విశ్వాసంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారని మంత్రి అన్నారు. దేశంలోని జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని, ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి, సామాజిక పురోభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించబోతున్నారని కేటీఆర్ అన్నారు.