శుక్రవారం రాత్రి ఓ హోటల్ లో ఐటీ ఎంట్రప్రెన్యూర్స్ తో ముఖాముఖి కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలైతే నగర జనాభా మరో రెండు కోట్లు పెరుగుతుందని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, ఐటీ, పోలీస్, పరిశ్రమల శాఖలన్నీ కార్యాచరణ రూపొందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారని తెలిపారు.
హైదరాబాద్ ప్రపంచంలోనే అందమైన, ఆకర్షణీయమైన, సమశీతోష్ణస్థితి కలిగిన నగరమని, అన్ని నగరాల కంటే అధికంగా స్థలాలు ఉన్నాయని అన్నారు. అయినాకూడా బెంగుళూరులో అత్యధికంగా 21 బిలియన్ డాలర్ల ఐటీ ఎగుమతులు జరుగుతుంటే హైదరాబాద్ లో మాత్రం 8 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతుండటం ఆశ్చర్యకరమని కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి కారణం హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు అవకాశం లేకపోవడమే కారణమని, అందుకే దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటింగ్ సిస్టంను అమలు చేయాలని నిర్ణయించామని, ఆరు నెలల్లో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గత ఐదేళ్లుగా హైదరాబాద్ కు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోయాయని ప్రచారం జరుగుతుందని, ఉద్యమం కారణంగా ఐటీ, పారిశ్రామిక వర్గాలు వెనక్కు పోయాయనడంలో అర్థం లేదని, దీనికి ఉదాహరణ 284కోట్ల ఐటీ ఎగుమతులనుండి 50వేల కోట్లకు చేరిందని ఐటీ శాఖ లెక్కలు చూపిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని, దేశంలో మొదటి వైఫై నగరంగా హైదరాబాద్ ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పన్ను రాయితీలు ఉండవంటూ చేసే దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పన్ను రాయితీలు రెండు రాష్ట్రాలకూ వర్తిస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమానికి మొదట 150మంది ఎంట్రప్రెన్యూర్స్ మాత్రమే హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేసినా, సుమారు 800 మంది హాజరు కావడంతో తెలంగాణ ఐటీ రంగం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ప్రభుత్వం ఊహించని రీతిలో ఎంట్రప్రెన్యూర్స్ హాజరు కావడంతో హైదరాబాద్ లో ఐటీ రంగంపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. దానికితోడు ఎంట్రప్రెన్యూర్స్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు చూసి అక్కడికి వచ్చిన వారంతా ప్రశంసించారు. దేశవిదేశాలు అనుసరిస్తున్న మార్గాలతో పాటు ఇక్కడి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆయన ఆకట్టుకున్న తీరు చర్చనీయాంశమయ్యింది. దీనితో ఐటీఐఆర్ ప్రాజెక్టు తేలికగా విజయవంతం అవుతున్న అభిప్రాయం అందరిలో వ్యక్తమయ్యింది.