ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖలో ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల చేనేత అభివృద్ధి శాఖ మంత్రుల సమావేశంలో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని, ఒక నూతన రాష్ట్రానికున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కేంద్రం అండదండలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో తెలంగాణ చేనేతకు చాలా పేరుందని, ఇక్కడి పోచంపల్లి, గద్వాల, నారాయణపేట తదితర వస్త్రాలు ఖండాంతర ఖ్యాతిని అర్జించాయని, తెలంగాణ రాష్ట్రంలో నూతన వస్త్ర విధానాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. జౌళిరంగంలో ప్రపంచం మొత్తానికే భారతదేశం హబ్ గా మారబోతుందని, ఇందులో తెలంగాణ పాత్ర గణనీయంగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జౌళిరంగ అభివృద్ధి కోసం రీసర్చ్ సెంటర్, మెగా క్లస్టర్స్, పవర్ లూమ్ సర్వీస్ సెంటర్, స్పిన్నింగ్ మిల్ వంటివి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.