హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో ఆదివారం జరిగిన పెగా డెవలపర్స్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవ సదస్సును ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పెగా డెవలపర్స్ సంస్థ వరుసగా రెండవ సంవత్సరం హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాన్ని అందిస్తుందని, రాష్ట్రంతో పాటు దేశంలో ఉద్యోగాల సంఖ్య పెంచడంలో ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ఐదువేల కంపెనీలు నగరానికి రానున్నాయని, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ రెడ్డి మాట్లాడుతూ, పవరింగ్ ద డిజిటల్ ఎంటర్ ప్రైజెస్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నట్లు, ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాలనుండి 2500 మందికి పైగా సిస్టమ్స్ సంస్థ సభ్యులు హాజరయ్యారు.