mt_logo

ఏరోనాటికల్ వార్షిక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్

ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఐసీసీలో ప్రారంభమైన రెండురోజుల సదస్సులో కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజు, ఐటీ శాఖామంత్రి కేటీఆర్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వీకే సారస్వత్, జీఎం రావు, హెచ్ఏఎల్ చైర్మన్ ఆర్ కే త్యాగి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో అవసరం లేకుండా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని, 250 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులను మెగా ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తిస్తుందని, వాటి స్థాపనకై ముందస్తు అనుమతులు తీసుకోనవసరం లేదని స్పష్టం చేశారు.

ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ఉన్నతస్థాయిలో ఉందని, ఏరోస్పేస్ రంగంలో కూడా హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. నవంబర్ లో ఈ రంగానికి చెందిన ఒక పెద్ద కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని, ప్రపంచంలోని వివిధ కంపెనీలు ఆ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ముందుండాలని, యువకుడైన వ్యక్తి ఐటీ మంత్రిగా ఉన్నందున ఇతర రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *