mt_logo

హంతకులే సంతాపం చెప్పినట్లు తెలంగాణ తల్లిపైన కూడా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది: కేటీఆర్

మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..  కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29 దీక్షా దివస్‌.. కేసీఆర్ దీక్షతో దేశ రాజకీయ వ్యవస్థపైన ఒత్తిడి వచ్చి, తెలంగాణ సబ్బండ వర్గాల సహకారంతో డిసెంబర్ 9న ఇదే రోజు తెలంగాణ ప్రకటన వచ్చింది.. దీన్ని విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం అని తెలిపారు.

ఇంత గొప్ప దినాన్ని మరిపించేలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసిన తెలంగాణ చరిత్ర ఉన్నన్ని రోజులు తెలంగాణ విజయ్ దివస్, కేసీఆర్ దీక్ష నిలిచి ఉంటుంది. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఎన్ని కుయుక్తులు చేసిన తెలంగాణ ద్రోహి గానే చరిత్రలో మిగిలిపోతారు  కేసీఆర్ గారి ఆనవాళ్లు చేరిపేస్తామంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో భాగంగా పూర్తిగా తెలంగాణ అస్తిత్వాన్నే లేకుండా చేసే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తుంది అని దుయ్యబట్టారు.

ఇప్పటికే అధికార చిహ్నంలోని కాకతీయ తోరణంతో పాటు, చార్మినార్‌ను మాయం చేసింది. ఈరోజు పెట్టిన కాంగ్రెస్ తల్లిలో బతుకమ్మను కూడా మాయం చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ తల్లి ఫోటో విడుదల చేయగానే సమాజం మొత్తం ఆ విగ్రహంపైన జోకులు వేస్తుంది సంవత్సరం పాలనలో దివాలా తీసిన కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితికి అద్దం పట్టేలా.. లంకె బిందెల కోసం వచ్చిన కొంతమంది తెలంగాణ తల్లి నగలనను, కిరీటాన్ని ఎత్తుకుపోయారని హేళన చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

తెలంగాణ తల్లి రూపం ఒక నాయకుడు, ఒక్క వ్యక్తి రూపొందించింది కాదు.. సమస్త తెలంగాణ సమాజం కలిసి రూపొందించుకున్న గొప్ప విగ్రహం. తెలంగాణ జాతి సమిష్టిగా ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి చిరునామాగా రూపొందించింది. మన భాష నుంచి మొదలుకొని తినే ఆహార అలవాట్ల దాకా, కొలిచే గ్రామ దేవతల వరకు వెక్కిరించిన సాంస్కృతిక ఆధిపత్యాన్ని చీల్చే విధంగా తెలంగాణ తల్లిని రూపొందించారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

భరతమాతకు, తెలుగు తల్లికి, ఇతర రాష్ట్రాల మాతలను కూడా వారు గౌరవనీయంగా, గొప్పగా రూపొందించుకున్నారు. చూడంగానే దండం పెట్టాలి అనిపించేటట్లు కిరీటం, నగలు పెట్టుకుని గొప్పగా రూపొందించుకున్నారు. అదేవిధంగా తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులు గొప్పగా తెలంగాణ తల్లిని రూపొందించుకున్నారు. 70 ఏళ్ల కింద దాశరధితోపాటు కవి రావెళ్ల తెలంగాణ తల్లి గురించి గొప్పగా మాట్లాడారు. తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని కల్పిస్తూ, ఆస్తిత్వానికి ఒక రూపాన్ని ఇచ్చేలా గొప్పగా ఆ రోజు తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజం ప్రతిష్టించుకుంది అని అన్నారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కలలు, జీవన విధానాన్ని అద్దిపట్టేలా తెలంగాణ తల్లిని రూపొందించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఆడబిడ్డలు సంబరంగా జరుపుకునే బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహంలో ఉంచడం జరిగింది. గద్వాల పట్టుచీరతో పాటు కరీంనగర్ వెండి మట్టెలు, తెలంగాణ తల్లి కిరీటంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కోహినూర్ వజ్రాన్ని ఉంచి గొప్పగా తెలంగాణ తల్లిని రూపొందించుకోవడం జరిగింది అని వ్యాఖ్యానించారు.

1950 నుంచి 2014 దాకా వేల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ తల్లి పేరుతో కొత్త డ్రామాకు తరలిపోయింది. హంతకులే సంతాపం చెప్పినట్లు తెలంగాణ తల్లిపైన కూడా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది

తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించేలా.. పేద మహిళా లెక్క రాష్ట్రం దివాలా తీసిన తీరుగా విగ్రహాన్ని రూపొందించి.. ఈ దివాళకోరు పాలకులు తమ భావదారిద్ర్యాన్ని చూపించుకున్నారు. తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరు.. కానీ తెలంగాణ తల్లిని మార్చిన దరిద్రులు తెలంగాణలో ఉన్నారు అని మండిపడ్డారు.

తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చమని ఈ ప్రభుత్వాన్ని ఎవరు అడిగారు? ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లులు మారుతారా. ప్రభుత్వాలు మారినప్పుడు భరతమాత గానీ తెలుగు తల్లి కానీ మారిందా. అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ బతుకమ్మను నాశనం చేసిండ్రు అని ధ్వజమెత్తారు.

తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థకు, ఒక పార్టీ కోసం సంబంధించింది కాదు మొత్తం తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తపరిచిన గొప్ప స్ఫూర్తి. ఇప్పటికే తెలంగాణలో బతుకమ్మ చీరలను మాయం చేసిన ప్రభుత్వం, తెలంగాణ పథకాలను మాయం చేసిన ప్రభుత్వం, మొత్తం తెలంగాణనే మాయం చేయాలని కుట్రచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు.

కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సచివాలయం ముందు పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని గాంధీభవన్‌కి పంపిస్తాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ పేరుతో మోసం చేస్తున్నారు.. ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ పంపిస్తాం. కాంగ్రెస్ తల్లి భస్మాసుర హస్తం చూపిస్తూ అభయహస్తం అంటూ మోసం చేస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఇదే కాంగ్రెస్ తల్లి అని కేటీఆర్ ఫైర్ అయ్యారు

తెలంగాణ ప్రజలు మోసపడేటట్లు చేసిన కాంగ్రెస్ తల్లిని ఖచ్చితంగా గాంధీభవన్‌కి పంపిస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పంపించుడు ఖాయం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఇదే కాంగ్రెస్ తల్లి. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకుంటే వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మిగిలిపోతాయని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి అని అన్నారు. 

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని తెలంగాణ ప్రజలు ఘనంగా చెప్పుకోవాలి. ఆ దిశగా ఈరోజు తొలి అడుగుగా మేడ్చల్ జిల్లా కార్యాలయంలో అద్భుతంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరం వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.

ఈరోజు కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా.. రేపు తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మూర్ఖులకు, కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తెలవదు అని తెలంగాణ తల్లిని వేడుకుందాం.. క్షమించమని అడుగుదాం. సందర్భం ఏదైనా కాంగ్రెస్ మోసగాళ్లను నమ్మవద్దు అని హెచ్చరించారు.

అడ్డగోలుగా హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి పార్టీని మరింతగా బలోపేతం చేసుకుంటూ అనేక కార్యక్రమాలను చేపడతాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌కి, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు అని తెలిపారు.