హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పలువురు సీనియర్ నాయకులు హాజరైన ఈ కార్యక్రమం 2009 లో కేసీఆర్ దీక్ష జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొనసాగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రసంగంతో ముగిసింది.
అంతకుముందు కేటీఆర్ గారి నేతృత్వంలో బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి భారీగా ర్యాలీగా తెలంగాణ భవన్ వరకు పార్టీ నేతలు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. తెలంగాణ భవన్‌లో ముందుగా తెలంగాణ తల్లికి ఆ తర్వాత జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలిలో పార్టీ శాసన మండలి నేత మధుసూదనా చారి, ఆ తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ఉక్కు సంకల్పంతో ‘తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో’ అంటూ జన సామాన్యులను తట్టుతూ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేశారు. ఇవ్వాళ 33 జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బంజారా బిడ్డలు వచ్చారు. వారి కళారూపాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం లేకిగా ప్రవర్తించింది. తెలంగాణ భవన్ వద్ద లైట్లు బంద్ జేసి, కరెంట్ తీసేసి ప్రభుత్వం చాలా తక్కువ బుద్ధితో వ్యవహరించింది అని విమర్శించారు.
మనం ఇవ్వాళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పెట్టుకోలేదు. ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే.. ఎటు పోవాలో అర్థం కాదు. నిన్న ఏ దారిలో నడిచి వచ్చామో తెలుసుకోకపోతే.. రేపు ఏ బాటలో పయనించాలో తెలియదు. చరిత్ర చదవకుండా. భవిష్యత్‌ను నిర్మించలేం. గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్ణయించుకోలేం అని పేర్కొన్నారు.
ఆనాటి కేసీఆర్ గారి పోరాటం, అమర వీరుల త్యాగాలు, ఉద్యోగ సంఘాల పోరాటాల చరిత్ర కొత్త తరానికి తెలియాలి.
అందుకే.. ప్రతి జాతి తన ఘనమైన గత వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను, కథగానో, పాటగానో ఏదో కళారూపంలో నిత్యం గానం చేస్తూనే తర్వాతి తరాలకు అందిస్తూనే ఉండాలి.
వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురుతో వున్న నూతన యువతకు పౌరుషాన్ని నూరిపోస్తూనే ఉంటుంది అని వ్యాఖ్యానించారు.
రామాయణం, భారతం మహా ఇతిహాసాలు పురాణాలు వేల ఏండ్లుగా శ్రుతులుగా కథలుగా గ్రంథాలుగా పద్యాలుగా నాటకాలుగా వివిధ రూపాల్లో ప్రతి జనరేషన్‌ను చేరి భరతజాతిని ఐక్యంగా నిలబెట్టాయి అని అన్నారు. అదే మాదిరిగా ఒగ్గు కథలు, బుర్రకథలు, యక్షగానాలు, బతుకమ్మ పాటలు, నృత్య రూపాలు, చిత్రకళలు, చరిత్ర పాఠాలు, శిలాశాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని, సంస్కృతిని, మహనీయులను, వైతాళుకులను యాది చేసుకుంటూ ఉంటాం అని అన్నారు.
ఏ జాతి ఐతే తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది. ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు.. పరాజితుల చరిత్ర చెరివేసే ప్రయత్నం చేస్తారు అని హెచ్చరించారు. మీకు చరిత్ర లేదు.. సంస్కృతి లేదు.. మేం అధికులం మీరు అల్పులు అని మానసికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. బ్రిటీష్ వాళ్ల నుంచి.. సమైక్యాంధ్ర శక్తులు దాకా అదే పనిచేసాయి. తెలంగాణ భావజాలం మీద ఎన్నెన్ని దాడులు జరిగాయో మీకు గుర్తుండాలి అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి పాలించే సత్తా లేదని మనపై దాడి జరిగింది. కానీ వాటిని పటాపంచలు చేస్తూ దేశం గర్వించేలా చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. స్పార్టకసో.. గాంధీనో.. మార్టిన్ లూథరో.. మండేలానో ఎవరో ఒక యోధుడు మళ్లీ ఆ జాతిని మేల్కొల్పి విముక్తి చేయాల్సి వస్తుంది అని అన్నారు.
ప్రతిజాతికి.. ప్రతి దేశానికి .. ప్రతి ప్రాంతానిక ఒక కథ వుంటుంది. ఆ కథలో కథనాయకులు ప్రతినాయకులు.. త్యాగాలు.. విద్రోహాలు విజయాలు.. గుణపాఠాలు ఉంటాయి. తెలంగాణ కథలో కూడా కథానాయకుడు తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారు. అందుకే మన చరిత్రను రేపటి తరానికి.. ఆ కథను గాథను నరనరాన ఎక్కించాలి అని అభిప్రాయపడ్డారు.
లేకపోతే.. ఆ జాతి మళ్లా పరాయి దండయాత్రలోనే ఓడిపోయే ప్రమాదముంటుంది.. తెలంగాణ తెలుసుకోవాల్సిన వీరోచిత ఘట్టం
మన జాతికి మహత్తరమైన పోరాటాల చరిత్ర ఉంది. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ వుంది. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లను తెంచుకున్న విజయం ఉంది అని పేర్కొన్నారు.
కుట్రలను.. కుతంత్రాలను ఛేదించి, యావత్ జాతిని ఏకతాటిపై నడిపించి శాంతియుత పంథాలో వ్యూహాలు.. ఎత్తుగడలు రచించి.. ఉక్కు సంకల్పంతో.. చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు మనకు ఉన్నాడు. భారత స్వతంత్ర సంగ్రామంలో దండి యాత్ర.. సహాయ నిరాకరణ .. ఇంకెన్నో పోరాట ఘట్టాలు వున్నట్టే మన మలి దశ తెలంగాణ పోరాటంలో మహోజ్వల సందర్భాలు చాలా ఉన్నాయన్నారు.
1948 నుంచి 1956 వరకు ప్రత్యేక రాష్ట్రంగా ఉండే. ఆనాటి హైదరాబాద్ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా 1956 లో ఆనాటి ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతపు పెళ్లి చేశారు. ఇది ఇష్టం లేని పెళ్లి అని నిజామాబాద్ లో ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు.అమాయకపు ఆడపిల్ల, అతి ఉషారైన అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. ఈ బంధం సరిగా లేకపోతే ఎప్పుడైతే అప్పుడు విడాకులు తీసుకోవచ్చని ఆయన అన్నారు అని గుర్తు చేశారు.
ఆయన అన్నట్లుగానే జరిగింది. రాష్ట్రం మెదటి రోజు నుంచే కుట్రలు చేశారు. 1956 నుంచి 1969 వరకు తెలంగాణ లోలోపల ఉడికి పోయింది. 1969 నుంచి 1971 వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. బలవంతపు పెళ్లి చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని కర్కషంగా అణిచివేసింది. ఇందిరాగాంధీ హవాలో కూడా మన తెలంగాణలో 14 సీట్లకుగానూ 11 సీట్లు తెలంగాణ ప్రజాసమితికి ఇచ్చారు అని అన్నారు.
తెలంగాణ కోరిక ఎంత బలంగా ఉందో ఆనాడు ప్రజలు చాటి చెప్పారు.
కానీ ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా రకరకాల పేర్లతో తెలంగాణ ఆకాంక్షను అదిమిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకుంది. తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెడతారని అప్పట్లో అపోహాలు ఉండేవి.
కానీ కేసీఆర్ గారు 2001 లో పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆ అపవాదును పొగొట్టారు అని కొనియాడారు.
అద్భుత ఘట్టాల్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశం.. పరమోత్కృష్ట దృశ్యం. దీక్షా దివస్ ఇప్పుడెందుకు అవసరమంటే ఒకసారి ఆదమరిచి, అప్రమత్తత లేకుండా ఒక పొరపాటు చేస్తే.. 60 ఏండ్లు తెలంగాణ అరిగోస పడ్డది.. మూడు తరాలు పీడనకు బలై పోవాల్సి వచ్చింది అని గుర్తు చేశారు.
అందుకే.. తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమ యాది.. మళ్లా ఎందుకు పోరాట చరిత్ర అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. స్వతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో.. నిలబెట్టుకోవడం అంతే ముఖ్యమని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించాడో రేపటి తరానికి తెలుపాల్సిన బాధ్యత మన మీద ఉంది అని కేటీఆర్ సూచించారు.
నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో, శిఖండులు ఎవరో.. ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ జాగ్రత్త నేర్చుకుంటది.. శత్రువు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే వుంటారు. ప్రత్యర్థులు దాడులు చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఏర్పాటుతో నష్ట పోయిన శక్తులు మళ్లా ఏవో రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటాయాన్నారు. జాగ్రత్తగా గమనించండి అని అన్నారు.
కేసీఆర్ సీఎంగా దిగిపోగానే నిన్నటి దాకా అణిగిమణిగి వున్న కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి చూడండి. సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు. అస్తిత్వంపై ఎట్లా దాడి చేస్తున్నారో గ్రహిచండని కోరుతున్నా. ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు అని హెచ్చరించారు.
సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలు.. భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజా పోరాటాన్ని కించపర్చుతున్నారు. మన ప్రధాని మోడీ ఎప్పుడు చూసిన తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటాడు అని అన్నారు.
గుజరాతీ అయిన సర్ధార్ వల్లభ భాయ్ వచ్చి మనల్ని విడిపించారని చెబుతాడు. ఇంకో గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తున్నాడంటూ బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి.. మలి దశ ఉద్యమాన్ని మొత్తం అవమానించేలా నోరు పారేసుకుంటున్నారు. గుజరాత్ గులాములు ఒక పక్క.. ఢిల్లీ కీలుబొమ్మలు ఇంకో పక్క ఉన్నారు. వీళ్లతో తెలంగాణ అస్తిత్వానికి.. ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచివుంది. ఉద్యమంపై గన్ను ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నడు. ఆయన చెరిపేయాలని చూస్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను కాదు.. తెలంగాణ ఆనవాళ్లను.. అందుకే.. తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం.. చార్మినార్లను తొలిగించాలని దుర్మార్గమైన ఆలోచన చేశాడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఉద్యమం ఉద్భవించి.. తెలంగాణ జాతి ప్రణమిల్లే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తా అంటున్నాడు. సచివాలయం ఎదుట.. తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జాపెట్టి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నాడు. నీళ్ళు, నిధులు, నియమకాలు ఉద్యమ నినాదమే కాదని నీల్గుతున్నాడు. ఇవేవీ.. మామూలుగా తీసుకోవాల్సిన విషయాలు కానేకావు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. అస్మిత ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే.. ప్రస్తుత లోక్‌సభలో మన గళం వినిపించేటోళ్లే లేడు. 8 వాళ్లు గెలిచారు.. 8 వీళ్లు గెలిచారు. కానీ తెలంగాణ కోసం మాట్లాడే వాళ్లు లేరు అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఉన్నన్ని రోజులు అదానీలు, ప్రధానిలు ఇక్కడ అడుగు పెట్టే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ మీద పట్టుకోసం వస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టే వాళ్లే లేకుండా పోయారు. ఇది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదు. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు అంతా తెలంగాణ పై జరుగుతున్న దాడిని గుర్తించాలి అని సూచించారు.
అందుకే.. ఈ దీక్షా దివస్ సందర్భంగా 14 ఏండ్ల పోరాట చరిత్రను మననం చేసుకోవాలి ఈ తరంలోనూ ఆత్మగౌరవ స్ఫూర్తిని రగిలించాలి. ఆనాడు బ్రిటీషర్లు చేసిన దానికన్నా కూడా అరాచకంగా కొడంగల్‌లోని లగచర్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడి మహిళలపై బందిపోట్ల మాదిరిగా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు.
ఇప్పుడు నేను చూశాను. మన పోరాటానికి తలొగ్గి లగచర్లలో భూముల సేకరణ విరమించుకున్నారు అని అన్నారు.
ఇది బీఆర్ఎస్ విజయం. తెలంగాణ ప్రజల విజయం. గిరిజనులు, దళితులు, బీసీల, రైతుల విజయం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపరికి పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే అని వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తెలంగాణ భవన్ గుర్తు వస్తోంది. మూసీ, హైడ్రా, లగచర్ల బాధితులు సాయం కోసం తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. ప్రజలకు ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా సరే తెలంగాణ భవన్ తలుపులు తీసే ఉంటాయి అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ప్రజల కష్టాలకు సంబంధించి శాసన సభ, మండలి సహా అన్ని వేదికలపై పోరాటం చేస్తూనే ఉంటాం. తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ మాత్రమే. మరెవరూ కాదు. మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో.. కానీ వాళ్లు ఎవరో గుర్తించాలి. బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసి ప్రయోజనం పొందారు. కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుంది అని స్పష్టం చేశారు.
- Yadadri Thermal Power Station: A symbol of Telangana’s progress achieved under BRS government
- Revanth govt. abandons, but Tamil Nadu steps up to support Sircilla weavers
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ల సమస్యను లేవనెత్తుతాం: తాజా మాజీ సర్పంచ్‌లతో కేటీఆర్
- లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం: బాధితులతో కేటీఆర్
- అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కోల్పోలేదు: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం
- హరీష్ రావును కలిసిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు
- బూటకపు హామీలతో యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారు: కవిత
- అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్
- సమ సమాజ నిర్మాణ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్