mt_logo

కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో ఏపీ సర్కార్ పేచీ

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు ఒప్పందం ప్రకారం తాగునీరు అందించినా అది తమకు చేరలేదంటూ ఏపీ సర్కార్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. తాగునీటి ముసుగులో సాగుకు కూడా అక్రమంగా అదనపు నీరు పొందటానికి కేంద్రానికి చెప్పడంతో మరో వారం రోజులు నీరివ్వాలని రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటే సాగర్ ఎడమకాలువకు నీరు వదలాలని, తమకు కూడా తాగునీటి అవసరం ఉందని కేంద్రానికి లేఖ వ్రాయనుంది.

ఆంధ్రా సర్కార్ తప్పుడు లెక్కలను నమ్మొద్దని, కావాలంటే రికార్డులు పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని రివర్ బోర్డు తాత్కాలిక చైర్మన్ కు సూచించింది. నాగార్జున సాగర్ నుండి కృష్ణా డెల్టాకు మరో వారం రోజులపాటు తాగునీటిని అందించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలు జారీ చేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ సర్కార్ మండిపడింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రివర్ బోర్డు చైర్మన్ పాండ్యతో ఈ విషయమై ఫోన్ లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు.

వాస్తవానికి మంగళవారం నాటికి మూడు టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు 3.5 టీఎంసీల నీటి విడుదల పూర్తికానుంది. అయినప్పటికీ ఒక్క టీఎంసీ నీరు కూడా తమ డెల్టాకు చేరలేదని ఆంధ్ర సర్కార్ తప్పుడు లెక్కలు చూపిస్తూ కేంద్రంపై అదనపు నీటి విడుదలకు ఒత్తిడి తెచ్చింది. కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాలకు ఒకటి నుండి రెండు టీఎంసీల నీరు సరిపోతుందని, తాగునీరు పేరుతో సాగుకు ఆ నీటిని మళ్ళించడానికి చూస్తుందని తెలంగాణ సర్కార్ వాదన. అవసరమైతే నీటి చౌర్యం జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు. కానీ కేంద్ర జలసంఘం దీనిపై పెద్దగా దృష్టి పెట్టట్లేదు.

ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి నిల్వ 515 అడుగులకు పడిపోయింది. మినిమమ్ గ్రౌండ్ లెవల్ 510 కంటే కేవలం 4 అడుగులు ఎక్కువ ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే హైదరాబాద్ కు తాగునీరు కూడా కష్టమేనని తెలుస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుందో లేదోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *