శ్రీశైలం విద్యుదుత్పత్తి అంశంపై కృష్ణానది యాజమాన్య బోర్డు వ్యవహరించిన తీరు అనైతికమని, బోర్డు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తామని, తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులకోసం న్యాయపోరాటం చేస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన తీర్పుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమవేశానికి మంత్రి హరీష్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హరీష్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, నీటిపంపకం బోర్డు పరిధిలోకి రాదని, అది ట్రిబ్యునల్ చేయాల్సిన పనన్నారు. కేవలం ఒప్పందాలను అమలుపరచడం వరకే బోర్డు పని అని, తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డారు. కేంద్రంపై ఏపీ సర్కారు ఒత్తిడి తెచ్చి తీర్పు ఏకపక్షంగా వచ్చేలా చేసిందని, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుపై 48 గంతల్లొ తీర్పు ఇచ్చిన బోర్డు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును మాత్రం పట్టించుకోలేదని అన్నారు.
నిజానికి శ్రీశైలంలో ఏపీ వాటా కేవలం 33 టీఎంసీలే అయినా, అనధికారికంగా 90 టీఎంసీల నీటిని తీసుకుపోయారని, 65 టీఎంసీలు వాడుకున్నట్లు వాళ్ళే చెప్తున్నారని అన్నారు. దీనిపై బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రైతుల కష్టాలు చూడకుండా తీర్పు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ వత్తిళ్ళు ఉన్నాయని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తీర్పులో స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. బోర్డు తీర్పుపై తెలంగాణ బీజేపీ నేతల వైఖరేంటని, తెలంగాణ పంటలను ఎండబెట్టి కేంద్రాన్ని సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణకు రావాల్సిన కరెంటు ఏపీ ఇచ్చేలా కేంద్రం ద్వారా ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణ రైతులు అధైర్యపడొద్దని,ఇతర రంగాలకు కరెంటు తగ్గించి రైతులకు ఇస్తామని, ఎంత ఖర్చు పెట్టైనా సరే బహిరంగ మార్కెట్‌లో కొని కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ దరఖాస్తులేవీ తమవద్ద పెండింగ్‌లో లేవని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ చెప్తున్న మాటలు అవాస్తవమని, ఇప్పటివరకు ఆయనకు 30 లేఖలు రాశామని వాటిని మీడియాకు చూపించారు. కేంద్రంలో వంద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించట్లేదని, సీఎం కేసీఆర్ కూడా కలిశారని చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర వ్యవసాయమంత్రిని కలిసి లేఖ ఇచ్చారని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులేవీ తమవద్ద లేవని మంత్రి చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని హరీష్‌రావు పేర్కొన్నారు. ఐఏఎస్‌ల విభజన ఫైలు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదని, కేవలం అరగంట సమయంలో ఈ ఫైలును పరిష్కరించొచ్చని అన్నారు.