తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ ఆరుగురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అజ్మీరా చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం అరగంటలోపే ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు నాయిని, ఈటెల రాజేందర్, హరీష్ రావు, పోచారం, జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, టీ పద్మారావు, జోగు రామన్న, ఎంపీలు జితేందర్ రెడ్డి, కేకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు హాజరయ్యారు.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు:
తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాలు, మహిళా శిశు అభివృద్ధి
జూపల్లి కృష్ణారావు- పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి
సి. లక్ష్మారెడ్డి- విద్యుత్
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి- గృహనిర్మాణం, న్యాయశాఖ, దేవాదాయ
తలసాని శ్రీనివాస్ యాదవ్- వాణిజ్య, పన్నులు, సినిమాటోగ్రఫీ
అజ్మీరా చందూలాల్- గిరిజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక
ఇదిలాఉండగా ఎక్సైజ్ మంత్రి టీ పద్మారావుకు, అటవీ శాఖామంత్రి జోగు రామన్నకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పద్మారావుకు క్రీడలు, యువజన సర్వీసులు కాగా, జోగురామన్నకు బీసీ సంక్షేమం కేటాయించారు.