మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు రూపొందించిన కోటి బతుకమ్మల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణ పండుగలను గుర్తించి సెలవులు ప్రకటిస్తూ ఎడ్యుకేషన్ కాలెండర్ ను రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవానికి బతుకమ్మ పండుగతో నాంది పలకాలని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిని పూర్తిగా విస్మరించారని, పండుగ సెలవుల్లో సైతం వివక్ష చూపారని అన్నారు. స్వరాష్ట్రంలో మన పండుగలు వైభవోపేతంగా నిర్వహించుకుందామని, బతుకమ్మ ఏ కులానికో, మతానికో సంబంధించింది కాదని, తెలంగాణ సమాజం అంతా కల్సి జరుపుకునే పండుగని చెప్పారు. చదువు రానివాళ్ళు కూడా పాటలను పొల్లుపోకుండా పాడటం చూస్తే ఈ పండుగ మన జీవితాల్లో ఎంతబాగా కల్సిపోయిందో తెలుస్తుందన్నారు.
తెలంగాణ ప్రజలు ఏ పండుగైనా సామూహికంగా కలిసిమెలిసి జరుపుకుంటారని, ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీకని, బతుకమ్మ పాటల్లో దేవతలను స్మరించడం నుండి వీర గాథలు, కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు, త్యాగం, ప్రేమ లాంటివి కలబోసుకుని ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బతుకమ్మ పండుగను ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కరీంనగర్ ఎంపీ బీ వినోద్ కుమార్, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.