mt_logo

“కోస్తాంధ్ర విముక్తి చేసిన హైదరాబాద్” అనే ఒక సినిమా కథ

By: నారాయణస్వామి వెంకటయోగి

ఒక అత్తిలి నుండో, ఒక కొండవీడు నుండో, లేదూ గొడావరి డిస్ట్రిక్ట్ లలో ఒక పల్లెటూరి నుండో మన హీరో హైదరాబాద్ వస్తాడు! హైదరాబాద్ కి రాక ముందు ఆయన గారు తన వూళ్ళో పరమ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక ఉత్త సోమరిపోతు, ఆవారా, లఫంగ, తిరుగుబోతు అయిఉంటాడు. హీరోయిన్ బొడ్డు మీద బత్తాయిలో జాంపండ్లో (మరీ కొబ్బరి బోండాలు విసిరితే పిల్ల చచ్చి ఊరుకుంటుంది కనక) విసిరి ఒక రెండు పాటలు కూడా పాడి ఉంటాడు.

ఈయన గారి చేష్టలకు విసిగి వాళ్ళ నాన్న “ఒరే వెధవా ఇక్కడ మనకు ఇంత పొలమున్నా నీకు యే పని చేత కాక పోయే! హైదరాబాద్ లో మనకు చాల దగ్గరి చుట్టం ఒకాయన పెద్ద ఫాక్టరీ యజమాని ఉన్నాడురా! ఆయన దగ్గరకు వెళితే మాంచి జాబ్ ఇప్పిస్తాడురా! కాలు మీద కాలేసుకుని కనీసం అది అయినా కుదురుగా చేసుకోపోరా ” అని హైద్రాబాద్ పంపిస్తాడు!

మన హీరో గారు గొడావరి యాసలో రైలులో బోల్డు జోకులతో ప్రయాణం చేసి సికింద్రాబాద్ లో దిగగానే ఆటోవాడితో లొల్లి పెట్టుకుని (ఈయన గారు మాట్లాడే గొడావరి యాసేమో ఆటోవాడు అర్థం చేసుకోవాలి – ఆటోవాడు మాట్లాడే తెలంగాణ భాష ఈయనగారికి అర్థం కాడు). ఆటో వాడి భాషని నానా మాటలూ అని చేయి చేసుకుని ఈయన జిల్లా స్నేహితులుండే కాలనీలో దిగబడతాడు. ఈ లోపల ఈయన చుట్టూ స్న్హేహితులంతా తమ భాషే శుద్ద తెలుగు అన్నట్టుగా భ్రమింపచేస్తుంటారు.

మన హీరో గారు ముందుగా కాలనీలో తెలంగాణ భాష మాట్లాడే ఒక ‘గుండా’తో గొడవ పెట్టుకుని చితకబాది కాళ్లమీద పడేసుకుంటాడు. అది చూసి తెలంగాణ భాష మాట్లాడే కమేడియన్ మన హీరోగారికి దాసోహం అవుతాడు. ఇంక మన హీరో గారు తన స్నేహితుల గాంగ్ ని వెంటేసుకుని కాలనీలో తన జిల్లా ప్రజలకు రెచ్చిపోయి ప్రజాసేవ చేస్తుంటాడు. అప్పటిదాకా వాళ్ల నాన్న ఇచ్చిన ఉత్తరం ఇంకా గుర్తుకురాదు ఈయనకు (మరి యే శ్రమా చెయ్యకుండా తినడానికి అలవాటు పడ్డాడాయె)

ఒక రోజు హేరో గారు జూబిలీహిల్స్ బశ్టాప్ లో ఒక తెలంగాణ రౌడి బారి నుండి ఒక అమ్మాయిని వీరోచితంగా కాపాడుతాడు. ఆ అమ్మాయి హీరోని తన ఇంటికి తీసుకెళ్తున్ది – ఆ అమ్మాయి నాన్న యెవరో కాదు – మన హీరో గారి నాన్న కలుసుకోమన్న, హైదరాబాద్ లో సెటిల్ అయిన కోస్తాంధ్ర పారిశ్రామికవేత్త!

హీరో తన ఊరు పేరు తండ్రి పేరు చెప్పగానే చాలా సంబరపడిపోయి తన ఫాక్టరీ లో మేనేజర్ పోస్టులో చేరమని హీరోగారిని అపాయింట్ చేసేస్తాడు! హీరోగారు ఇంక తన ఉద్యోగంలో చేరి పోయి మొట్టమొదటగా లొల్లి చేస్తున్న ‘సోమరి పోతులైన’ తెలంగాణ కూలీలని చితకబాది హెచ్చరిస్తాడు! తన కింద అసిస్టెంట్లుగా తన స్నేహితుల గాంగ్ ని అపాయింట్ చేస్తాడు – అందులో తెలంగాణ కమేడియన్ కి కూడా చాయ్ తెచ్చే సర్వర్ ఉద్యోగం ఇప్పిస్తాడు ఉదారంగా! ఈ లోపల ఫాకట్రీ యజమాని కూతురు హీరో గారితో ఒక రెండు పాటలు కలకంటుంది ముచ్చటగా! హీరో గారు తన పల్లెటూరి మరదలు బొడ్డుని మర్చిపోలేక మరో పాట కలకంటాడు! ఇద్దరు హీరోయిన్ల సంగతి తెల్సిన మన తెలంగాణ కమేడియన్ ఇద్దరితోనూ హీరోగారు సరసమాడుతున్నట్టు ఒక కల కంటాడు! ఈ లోపల ఫాక్టరీకి, దాని యజమానికీ మరో పెద్ద విలన్ తో గొడవ జరుగుతుంది! ఈ విలన్ తెలంగాణకి చెంది హైదరాబాద్ ని కొన్ని యేండ్లుగా గడగడలాడిస్తూ పట్టి పీడిస్తుంటాడు!

ఇంకేముంది మన హీరోగారు రెచ్చిపోయి విలన్ తో నానా విన్యాసాల వీరోచిత యుద్ధంచేసి (ఈలోపల హీరో గారి తల్లితండ్రులు ప్రియురాలు కోస్త్రాంధ్ర నుండి హైద్రాబ్దాద్ రావడమూ తెలంగాణ విలన్ వాళ్లని కిడ్నాప్ చేయడమూ జరిగిపోతాయి) విలన్ ని మట్టి కరిపించి తనవాళ్లని రక్షించుకుని, హైదరాబాద్ ని తెలంగాణ విలన్ల నుండీ రౌడీలబ్నుండీ విముక్తం చేస్తాడు! ఈ కొట్లాట లో పల్లెటూరి హీరోయిన్ విలన్ కత్తిపోటుకు బలైపోతుంది – బతికున్న హీరోయిన్ తో ఫాక్టరీ యజమాని మామ హీరో పెళ్లి చేసి తన కూతురినీ, ఫాక్టరీని హీరోగారికి అప్పజెపుతాడు! హీరో తళ్లితండ్రులు ఆనందబాష్పాలు రాలస్తోంటే తెలంగాణ కమేడియన్ కేరింతలు కొడుతూండగా శుభం కార్డ్ పడుతుంది! (ఒక వేళ పల్లెటూరి హీరోయిన్ బతికి పోతే హీరో గారు ఇద్దరితోనూ సరసాలాడుతూండగా శుభం పడుతుంది)

మిత్రులారా – యెన్నేండ్ల సంది ఇసుంటి సినిమాలు చూస్తున్నాం? యింకా యెన్నేండ్లు చూద్దాం? మొన్న జరిగిన ‘సమైఖ్యాంధ్ర’ సభ కూడా ఈ సినిమా లెక్కనే లేదూ?

 

Related Posts:

– తెలంగాణపై విషం చిమ్మిన ‘కందిరీగ’ 

– తెలుగు సినిమాకున్న రోగం కొత్తదీ కాదు… మానేదీ కాదు 

– మాయ తెర

– తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ 2013 విజయవంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *