mt_logo

ఓటర్లకు కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రలోభాలు!!

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు బరితెగిస్తున్నారు. ఓటర్లను అన్నివిధాలా ప్రలోభాలకు గురిచేయడం మొదలు పెట్టారు. కొద్దిరోజులుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు కార్లలో తరలిస్తున్న డబ్బులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలకు సంబంధించిన డబ్బులు పట్టుబడగా.. తాజాగా బీజేపీ పార్టీకి చెందిన రూ. 8 కోట్లు తనిఖీల్లో దొరికాయి. కాగా మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టవర్స్ వద్ద పోలీసులు సోడా నిర్వహించి సందీప్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్కోడా కారులో తరలిస్తున్న రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంస్థలో సందీప్ రెడ్డి అడ్మిన్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు అతని వద్ద నుండి నగదు, ల్యాప్ టాప్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

విశ్వేశ్వర్ రెడ్డికి సందీప్ రెడ్డి సమీప బంధువే కాకుండా డబ్బులకు సంబంధించిన మొత్తం లావాదేవీలు చూస్తుంటాడు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత డబ్బులు పంపిణీ చేయాలి? ఎవరెవరికి ఎంత ఇచ్చారు? ఇంకా ఎంత ఇవ్వాలో పూర్తి వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సందీప్ రెడ్డి నుండి గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూతు కమిటీలకు ఎంత ఇవ్వాలి? మద్యానికి ఎంత ఖర్చు పెట్టారో? కార్యకర్తలకు ఎంత ఇచ్చారో లాంటి పూర్తి వివరాలు ఉన్న డైరీని పోలీసులు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా మద్యం పంపిణీ ఖర్చుల వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి ఎంత ఇచ్చారన్న దానిపై కోడ్ భాషలో రాసుకున్నారు. ఇప్పటివరకు రూ. 15 కోట్లు పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అపోలో హాస్పిటల్ కేంద్రంగా గత పదిహేను రోజులుగా జరుగుతున్న కుట్రను పోలీసులు చేధించారు. సందీప్ రెడ్డి వ్యవహారంపై ఐటీ అధికారులకు సమాచారం అందించారు. ఐటీ అధికారులు సందీప్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *