భారతదేశంలో పౌల్ట్రీ ఒక పెద్ద పరిశ్రమ అని, కోళ్ళ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. హైటెక్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఎక్స్ పో-2014 ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, పౌల్ట్రీ రంగానికి కావలసిన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎంతటి సమస్య అయినా గంటలో పరిష్కారం చూపేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కల్తీ లేని స్వచ్చమైన చికెన్, గుడ్లు మన రాష్ట్రంలోనే విరివిగా దొరుకుతుంటే అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని, కొంతమంది కోళ్ళ వ్యాపారులు అమెరికా నుండి లెగ్ పీసులు దిగుమతి చేసుకోవాలని లాబీయింగ్ చేస్తున్నారని, ఇదే జరిగితే భారతదేశంలో కోళ్ళ పరిశ్రమ నష్టాల ఊబిలోకి జరుకుంటుందని సీఎం చెప్పారు.
తెలంగాణలో కోళ్ళ పరిశ్రమకు అపారమైన అవకాశాలతో పాటు అనుకూలమైన వాతావరణం ఉందని, దాణా కొనుగోలుకు ఖర్చు విపరీతంగా పెరుగుతున్నందున సబ్సిడీ కూడా పెంచామని, బడ్జెట్ కేటాయింపులో పౌల్ట్రీ రంగానికి రూ. 90 కోట్ల నుండి రూ. 220 కోట్లకు పెంచామని కేసీఆర్ వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, భారీ పౌల్ట్రీ సంస్థలు స్థాపించేవారికి అవసరమైతే భూములు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.
ఎగ్జిబిషన్ అడ్వైజరీ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, చింతల కనకారెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ ప్రదీప్ రావు, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.