రాష్ట్ర ప్రభుత్వాల అంశమైన శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించి సమాఖ్య వ్యవస్థకు కేంద్రప్రభుత్వం విఘాతం కలిగించాలని చూస్తుందని, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి లేఖను కూడా వ్రాశారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హోంశాఖ పంపిన ఆ లేఖనుఉపసంహరించుకోవాలని ఆ ప్రధానికి రాసిన లేఖలో సీఎం స్పష్టం చేశారని, ప్రధాని నుండి సానుకూల నిర్ణయం వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హోం శాఖ ఈనెల 8న పంపిన లేఖ ద్వారా కేంద్రం తన అభిప్రాయాలను, నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తుందని, కేంద్రం ఇలాగే మొండిగా పోతే ఇతర మార్గాలు, ఉపాయాలను అనుసరించాల్సి వస్తుందని, ఆ నిర్ణయాలు ఏమిటనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాటి నుండి ఎక్కడా చిన్న సంఘటన కూడా జరగలేదని, అయినప్పటికీ కేంద్రం లేఖ పంపాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ ప్రధాని మోడీకి తెలియకుండానే ఆ లేఖ పంపించి ఉండొచ్చని, అందుకు అవకాశం కూడా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.