mt_logo

కేంద్రంతో అమీతుమీ నేడే

హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. పార్లమెంట్ వేదికగా సోమవారం ఉభయసభల్లో ఈ విషయంపై చర్చ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాని మోడీకి లేఖ వ్రాయడం కూడా జరిగింది. పార్లమెంటులో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు సూచించారు.

ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి భేటీ అయ్యి పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు గంటన్నరపైగా చర్చించారు. పార్లమెంటులో ఆందోళన జరపడంతో పాటు కేంద్ర వైఖరికి నిరసనగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టాలని సీఎం వారికి వివరించారు.

ఎంపీలంతా సోమవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఇతర పార్టీల ఎంపీలను కలిసి కేంద్ర హోం శాఖ రాసిన లేఖపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఏవిధంగా మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందో తెలపాలని, ఇలాంటి చర్యలు ఉపేక్షిస్తే ముందుముందు ఇతర రాష్ట్రాల అధికారాలపై కూడా కేంద్రం పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే విషయాన్ని వారికి వివరించి చెప్పాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.

సీఎంతో చర్చ అనంతరం టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన లేఖపై పార్లమెంటులో సోమవారం వాయిదా తీర్మానం ఇస్తామని, స్పీకర్ అనుమతించక పోయినా తాము పట్టుబట్టి చర్చించి తీరుతామని, ఒక్క తెలంగాణకే ఇది పరిమితం కాదని, రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కేంద్రం పెత్తనం చెలాయించేందుకు ఇది ఆరంభమని తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఎంపీలందరినీ కూడగట్టి ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి కలుస్తామని, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీకి ఇలాంటి పరిణామాలే ఎదురైనప్పుడు కేంద్రం అధికారాలను ఆయన ప్రశ్నించిన తీరును మోడీకి గుర్తు చేస్తామని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *