ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మోడీని, కేంద్ర హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖ, న్యాయ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే విషయం, పోలవరం ఆర్డినెన్స్ పై కూడా రాష్ట్రపతితో చర్చిస్తారని సమాచారం.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సచివాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి పద్మారావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ ఎన్జీవోల సభలో జై తెలంగాణ నినాదాలు చేసి సస్పెన్షన్ కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు సీఎం ను కలిశారు. శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం ముదిరాజ్ కానిస్టేబుళ్లు గతంలో ఏపీఎన్జీవోల సభలో జై తెలంగాణ నినాదాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. కేసీఆర్ ను కలిసిన వీరిద్దరూ తమపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరగా కేసులు ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.