mt_logo

ఇచ్చింది సోనియాగాంధీ.. మరి తెచ్చింది ఎవరో చెప్పాలి?

కాంగ్రెస్ అంటున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ వల్లే ఏర్పడింది.. ఇందులో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను విస్మరించలేరు. కానీ రాష్ట్రం ఇచ్చింది సోనియా అయితే మరి తెచ్చింది ఎవరో కూడా కాంగ్రెస్ చెప్పాలి కదా, విజ్ఞత రెండువైపులా ఉండాలి కదా అని ముఖ్యమంత్రి కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి అన్నారు. కొందరు టీఆర్ఎస్ సభ్యులు వెంటనే కేసీఆర్, టీఆర్ఎస్ అని చెప్పగానే, మీరు కాదు పెద్దలు డీ శ్రీనివాస్ చెప్పాలని కేసీఆర్ నవ్వుతూ అన్నారు.

అంతకుముందు సీఎం మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే. కమల్ నాథన్ కమిటీ నివేదిక పూర్తయిన తర్వాత ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల విభజన అనంతరం వెంటనే నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పోలీస్ డిపార్ట్ మెంట్ లో 3726 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు, 600 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగాల కోసం డీఎస్సీ ఉండదని, పిల్లల చదువుల కోసం డీఎస్సీ ఉంటుందని, విద్యా వ్యవస్థలో మార్పుల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ, వయోపరిమితిని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులకు వయస్సు సడలింపు ఇచ్చి రిక్రూట్ మెంట్లలో అవకాశం కల్పిస్తామని చెప్పారు.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని, ఇక్కడ ధరలు పెరగడం మళ్ళీ ప్రారంభమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో కూడా ఆంధ్రలో తగ్గి హైదరాబాద్ లో ధరలు పుంజుకున్నాయని వెల్లడించిందని, కొన్ని పత్రికలు పిచ్చి వార్తలు రాస్తుంటే వీటిని చూసి మేం నవ్వుకుంటామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు గుంట భూమిని కూడా అమ్మలేదని, మూడున్నర లక్షల మందికి ఉచిత క్రమబద్ధీకరణ చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *