mt_logo

బిల్లుకు మద్ధతు కోరుతూ జాతీయనేతలతో కేసీఆర్ ములాఖత్

తెలంగాణ బిల్లు మరికొద్ది రోజుల్లో పార్లమెంటుకు చేరుకోనున్న సందర్భంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు పలువురు జాతీయ నాయకులను కలిసి మాట్లాడుతున్నారు. గతంలోనే అన్ని పార్టీల మద్దతు సాధించినా, కీలకసమయంలో పార్టీ అధ్యక్షులతో సమావేశమై బిల్లుకు సంపూర్ణ మద్దతు సాధించడానికి రెండురోజుల క్రితమే కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిసి సమావేశమై తెలంగాణ అంశంపై చర్చించారు. సమావేశం అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని, ఉభయ సభలలోని తమ అభ్యర్థులు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ మొదటినుండీ పూర్తి మద్దతు తెలుపుతుందని, తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమైనందున వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదంపొందేందుకు కృషి చేయాలని సోనియాగాంధీని, కేంద్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. మొదట తాను బీహార్ విభజనను వ్యతిరేకించినా తర్వాత అంగీకంరించానని అన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు ఆర్జేడీ మొదటినుంచీ అనుకూలమని, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ కూడా వ్రాసిందని చెప్పారు. లాలూ మద్దతు పట్ల కేసీఆర్ ఆయనకు తెలంగాణ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం గం.12.30ని.లకు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ ను కేసీఆర్ కలిసి తెలంగాణ బిల్లుపై చర్చించారు. తెలంగాణకు మద్దతుగా కేసీఆర్ తో తాను బహిరంగసభల్లో కూడా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ తమ పార్టీ ఇంతకుముందు తీర్మానం కూడా చేసిందని గుర్తుచేశారు. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తమ మిత్రపక్షాలతో కూడా సంప్రదించి పూర్తి మద్దతు కూడగడతామని రాంవిలాస్ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ, ఢిల్లీలో తమకు అండగా ఉండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మిగతా పార్టీల మద్దతు కూడా కోరుతామని చెప్పడం ఎంతో ఆనందించదగ్గ విషయమని ప్రశంసించారు.

ఆదివారం సాయంత్రం జనతాదళ్(యు) అధినేత శరద్ యాదవ్ ను కేసీఆర్ కలిసి తెలంగాణ అంశం ప్రస్తావించగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటినుంచీ తమ మద్దతు ఉందని స్పష్టం చేశారు. 2005 లోనే తమ పార్టీ నేత జార్జి ఫెర్నాండెజ్ తరపున లేఖ ఇచ్చామని, తెలంగాణ సమస్య ఎప్పటినుంచో ఉందికాబట్టి కేంద్రం తక్షణ పరిష్కారం తీసుకోవాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, జేడీయూ మొదటినుంచీ తెలంగాణకు అనుకూలమని, బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో కూడా వారి పూర్తి మద్దతు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరి తరపున కేసీఆర్ శరద్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియచేసారు. ముగ్గురు జాతీయనాయకులను కలిసినవారిలో కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రముఖులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *