ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు 40మంది టీఆర్ఎస్ సభ్యుల బృందంతో ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించారు. తెలంగాణ బిల్లును వేగంగా ముందుకు తీసుకెళుతున్నందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని డిమాండ్లతో కూడిన మెమొరాండంను ప్రధానికి అందచేసామని, తాను ఢిల్లీ వెళ్ళేటప్పుడు తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగివస్తానని చెప్పిన మాట ప్రధాని హామీతో నిజం కాబోతుందని వివరించారు. తెలంగాణ బిల్లును ఆమోదించడానికి కేంద్రప్రభుత్వం పట్టుదలతో ఉందని ప్రధాని చెప్పినట్లు అన్నారు.
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. చాలా కాలంగా తెలంగాణ అంశం పెండింగ్ లో ఉందని, ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.