ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఈరోజు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి భీరేంద్రసింగ్ తో సమావేశమై వాటర్ గ్రిడ్, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా ఉపాధిహామీ అన్ని మండలాలకు వర్తింపజేయాలని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని భీరేంద్రసింగ్ కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సమావేశం అనంతరం కేంద్రమంత్రి భీరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం చాలా పెద్దదని, ఈ పథకం కోసం ప్రపంచబ్యాంకు నిధులు వచ్చేలా చూస్తామని, వచ్చే బడ్జెట్ లో తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని పేదరిక నిష్పత్తిపై సమీక్ష చేస్తున్నామని, వెనుకబడిన జిల్లాలను బ్లాకులుగా గుర్తిస్తున్నామని, ఉపాధిహామీ పథకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.