శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గురువారం రాత్రి కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ సభ్యులు కలిసారు. ఈ సందర్బంగా ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపించినందుకు యావత్ తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రపతికి కేసీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు. మీ ఆశీస్సులు ఉంటేనే సంపూర్ణ తెలంగాణ సాధించుకుంటామని కేసీఆర్ అన్నట్లు సమాచారం. తెలంగాణ బిల్లులో ఉన్న కొన్ని అంశాలపై సవరణ చేయాలని సూచిస్తూ తయారు చేసిన 10 పేజీల లేఖను రాష్ట్రపతికి అందించారు.
నీళ్ళు, నిధులు, నియామకాల కొరకే తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్నారని, ఏ ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కూడా రాష్ట్రపతికి వివరించారు. తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వారిలో మూడొంతుల మంది సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారని కూడా స్పష్టం చేశారు. ఏపీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆలిండియా సర్వీస్ అధికారులు హైదరాబాద్ నుండే పెన్షన్లు పొందుతారని, అలా కాకుండా స్థానికత ప్రకారంగా పెన్షన్లు ఇవ్వాలని కూడా రాష్ట్రపతికిచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగాల్లో అవకతవకలకు సీమాంధ్రులు ఎలా పాల్పడినదీ, డిప్యుటేషన్ విధానం ద్వారా చేసిన అవినీతిని కేసీఆర్ వివరించారు. జోనల్ పోస్టులను స్టేట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేసి సీమాంధ్రులతో ఎలా భర్తీ చేసిందీ, నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా మార్చి లోకల్ కోటా లేకుండా చేశారన్నారు. ఉమ్మడి రాజధాని, గవర్నర్ కు శాంతి భద్రతలు అప్పగించడంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఉమ్మడి హైకోర్టు, ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యుత్ రంగం, అప్పులు, ఆస్తుల పంపకం, నీటివనరుల నిర్వహణ తదితర అంశాలపై ప్రస్తావిస్తూ బిల్లులో అనేక సవరణలు చేయాల్సిందేనని, కాని పక్షంలో సంపూర్ణ తెలంగాణ సాధించుకున్న్నా తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారని రాష్ట్రపతిని కేసీఆర్ కోరారు.