mt_logo

లోయర్ మానేరు డ్యాం లో కేసీఆర్ ఐలాండ్..

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం త్వరలో మరో పర్యాటక కేంద్రంగా మారనుంది. డ్యాం మధ్యలో నాలుగు ఎకరాలలో ఉన్న మైసమ్మగుట్టపై రూ. 20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్ పేరుతో అత్యాధునిక వసతులతో టూరిస్టులను ఆకట్టుకునేలా పలు నిర్మాణాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మొదటి దశలో రూ. 5 కోట్లు కేటాయించారు. ఇప్పటికే డ్యాం దిగువ భాగంలో రూ.551 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇస్తూ నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దిగువ మానేరు రివర్ ఫ్రంట్ ఇప్పటికే ఐటీ టవర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఒకవైపు ఉజ్వల పార్క్, మరోవైపు డీర్ పార్క్ ఉన్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయితే అద్భుతమైన పర్యాటకకేంద్రంగా మారనుంది. మరోవైపు తాజాగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ఐలాండ్ కూడా పూర్తయితే దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది.

కరీంనగర్ సిటీ రెనోవేషన్ లో భాగంగా మైసమ్మగుట్టపై కేసీఆర్ ఐలాండ్ ఏర్పాటుచేయాలని ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొద్దిరోజులకింద నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా గంగుల కమలాకర్ ప్రస్తావించారు. ఇండోనేషియా, బెంగళూరుకు చెందిన ఇన్ఫినెట్యూడ్ డిజైన్స్ సంస్థకు ఈ ప్రాజెక్టు వివరాలు అందజేయగా వారు క్షేత్రస్థాయిలో పర్యటించి మైసమ్మ గుట్టపై పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రాధమిక నివేదిక అందజేశారు. దీంతో పర్యాటక శాఖ రూ.20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్ కు అనుమతి ఇచ్చింది.

కేసీఆర్ ఐలాండ్ ను సంవత్సరం లోపు నిర్మిస్తామని కాంట్రాక్ట్ సంస్థలు తమకు హామీ ఇచ్చారని, కరీంనగర్ కార్పొరేషన్ కు సీఎం కేసేఆర్ ఇచ్చిన రూ. 100 కోట్ల నుండి రూ.3 కోట్లు కేటాయించామని, మరో రూ. 2 కోట్లు పర్యాటకశాఖ ఇచ్చిందని, దశలవారీగా జరిగే నిర్మాణాలకు కావాల్సిన నిధులు కేటాయిస్తామని గంగుల కమలాకర్ చెప్పారు. ప్రపంచస్థాయి టెక్నాలజీతో నిర్మించనున్నారు. ఇండోనేషియా ఆర్కిటెక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు, 40 మందికిపైగా విందు చేసుకునేందుకు వీలుగా ఫ్లోటింగ్ రెస్టారెంట్, క్యాండిల్ లైట్ డిన్నర్, కాక్ టైల్ పార్టీల కోసం నలుమూలలా ఫ్లోటింగ్ బ్రిడ్జీలు, పిల్లలు, పెద్దలకోసం వేరువేరుగా స్విమ్మింగ్ పూల్స్, రెండు ఎలివేటెడ్ బ్రిడ్జీలు, పర్యాటకులు వివిధ సూట్స్ వెళ్ళడం కోసం లిఫ్టులు, సెవెన్ స్టార్ హోటల్ కు మించిన సదుపాయాలతో వీవీఐపీల కోసం గుట్టపైభాగంలో ప్రెసిడెన్షియల్ సూట్, పూర్తిగా అద్దాలతో బాంకెట్ హాల్, మెడిటేషన్ హబ్, ఆధునిక వసతులతో ఐదు ప్రీమియం సూట్స్ మొదలైనవి ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *