హైదరాబాద్ లో అక్టోబర్ 7 నుండి 9 వరకు జరగనున్న మేయర్ల సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ముఖ్యమంత్రి కే చద్రశేఖర్ రావు ఆహ్వానించారు. శుక్రవారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు గవర్నర్ తో సమావేశమై సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ, ఐటీ అభివృద్ధి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తదితర అంశాలపై చర్చించారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు 60 దేశాలనుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, రాష్ట్రపతి, ప్రధానిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామని, ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని గవర్నర్ ను ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 9, 10 షెడ్యూళ్ళలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా హెచ్వో డీలను ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు కలిగిస్తుందని కేసీఆర్ గవర్నర్ కు వివరించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి భవనం కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం పేర్కొన్నారు. ఈసారి జరిగే బతుకమ్మ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని, దేశంలోని మహిళా ముఖ్యమంత్రులు, లోక్ సభ స్పీకర్, మహిళా గవర్నర్లు, అన్ని రాష్ట్రాల మహిళా మంత్రులను ఆహ్వానించి ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపనున్నట్లు గవర్నర్ కు కేసీఆర్ తెలిపారు.