mt_logo

ఢిల్లీ చేరుకున్న కేసీఆర్

ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరగనున్న మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు టీఆర్ఎస్ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. మోడీ ప్రమాణస్వీకారానికి ఎంపీలందరూ హాజరుకానున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు పార్టీ ఎంపీలకు కేసీఆర్ విందు ఇవ్వనున్నారని, వీరంతా మంగళవారం హైదరాబాద్ కు తిరిగి వస్తారని సమాచారం.

పలువురు ఎంపీలు ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ, ఎంపీగా తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. కరీంనగర్ ఎంపీ బీ వినోద్ మాట్లాడుతూ, రానున్న ఐదేళ్ళ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందని, బంగారు తెలంగాణ సాధనకూడా ఉద్యమ తరహాలో జరుగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో మీడియాలో ప్రచారమే ఎక్కువగా జరిగిందని, నిజమైన అభివృద్ధి తక్కువని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మాటలు తక్కువ చెప్పి చేతల్లో చూపిస్తుందని అన్నారు.

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం అందుతుందని తాము నమ్ముతున్నామని, చంద్రబాబు లాంటి వ్యక్తులవల్ల ఏమైనా తేడాలొస్తే తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలే బాధ్యత వహించాలని చెప్పారు. తెలంగాణ ఎంపీలుగా అనేక ప్రాజెక్టులు పూర్తిచేయాల్సి ఉందని, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, పోలవరం ప్రాజెక్టు వివాదం పరిష్కరించడం తదితర అంశాలు ఉన్న నేపథ్యంలో తాము కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటామని కవిత చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *