తెలంగాణలో ఇంకా ఆంధ్రామీడియా అహంకారాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈరోజు జరిగిన శాసనసభలో ఆయన మాట్లాడుతూ, టీవీ9 ఛానల్ తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగిన మొహాలని ఘోరంగా విమర్శించిందని, ఏ ధైర్యంతో టీవీ9 ఈ విధంగా ప్రసారం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా పనికట్టుకుని విషం కక్కుతుందని, అడ్డగోలు రాతలు రాస్తే ఊరుకోమని, లేని ఇష్యూలు ఉన్నట్లు చూపిస్తున్న ఆంధ్రా మీడియా అహంకారాన్ని సహించేది లేదని, తమిళనాడు తరహాలో కేబుల్ చట్టాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.
సీఎం వ్యాఖ్యలు చూసిన టీవీ9 యాజమాన్యం తమ తప్పును సరిదిద్దుకునే క్రమంలో వెంటనే స్పందించింది. తెలంగాణ శాసనసభ్యులపై బుల్లెట్ న్యూస్ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు ప్రసారం కావడంపై చింతిస్తున్నామని, ఈ వ్యాఖ్యల ప్రసారంపై శాసనసభకు టీవీ9 క్షమాపణ చెప్తుందని, భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని టీవీ9 ఎడిటర్ ప్రకటించారు.