mt_logo

సోనియా గాంధీని కలిసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా ఆదివారం మధ్యాహ్నం సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. భార్య, కుమారుడు కేటీఆర్ దంపతులు, కూతురు కవిత దంపతులు, మేనల్లుడు హరీష్ రావు దంపతులు, మనవళ్ళు, మనవరాలు అంతా కలిసి 20 నిమిషాలపాటు మేడమ్ నివాసంలో గడిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ద్వారా తెలంగాణ బిడ్డల బలిదానాలు జరగకుండా అడ్డుకట్ట వేశారని, ప్రాణాలను ఫణంగా పెట్టి దీక్ష చేసిన తన భర్త ప్రాణాలను కాపాడేందుకు డిసెంబర్ 9న ప్రకటన చేసినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ సతీమణి శోభ సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులతో సమావేశం తర్వాత మరో పదినిమిషాలు కేసీఆర్ సోనియాతో సమావేశమై తెలంగాణ పునర్నిర్మాణం కోసం అవసరమైన అంశాలకు సంబంధించి ఒక నోట్ ను ఆమెకు సమర్పించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, నదీ జలాల పంపిణీ, అధికారుల కొరత తీర్చాలని, విద్యుత్ కొరత తీర్చాలని, విద్య, వైద్య రంగానికి ప్రాముఖ్యత కల్పించాలని, ప్రాణహితకు జాతీయ హోదా కల్పించాలని తదితర అంశాలు అందులో పొందుపరచారు. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, సోనియాగాంధీ కృషివల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అందుకు కృతజ్ఞతగా కుటుంబసభ్యులంతా వెళ్లి ఆమెను కలిసామని అన్నారు. తమ మధ్య రాజకీయ అంశాలు చర్చలోకి రాలేదని, రెండు రోజులు ఇక్కడే ఉండి రాష్ట్రపతిని, ప్రధానిని, బీజేపీ నేతలను, మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులను కలుసుకుంటానని వివరించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమరుల తల్లుల కడుపుకోతను అర్ధం చేసుకుని ఓ తల్లిలా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని, అందుకే ఆమెను కలిసి ధన్యవాదాలు తెలిపామని అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే హైదరాబాద్ లో అడుగుపెడతానని మాట ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ ఈనెల 26 న హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం చేరుకోగానే అక్కడినుండి భారీ ర్యాలీ ప్రారంభమై గన్ పార్క్ వరకు ఉంటుందని, తర్వాత ర్యాలీ తెలంగాణ భవన్ కు చేరుకోగానే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ నివాళులర్పిస్తారని టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *